న్యూఢిల్లీ: నకిలీ ఓటింగ్ నివారణకు పోలింగ్ కేంద్రాల్లో ఫింగర్ ప్రింట్, ఐరిస్ బయోమెట్రిక్ గుర్తింపు వ్యవస్థను అమలు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై భారత ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. బయోమెట్రిక్ ఓటింగ్ విధానంపై తమ తమ అభిప్రాయాలు తెలియజేయాలని కోరింది. కాగా, భారత ప్రజాస్వామ్యానికి వెన్నుముక లాంటి ఎన్నికల ప్రక్రియలో నకిలీ ఓటింగ్‌ను నిరోధించేందుకు ఫింగర్ ప్రింట్, ఐరిస్ బయోమెట్రిక్ గుర్తింపు వ్యవస్థను అమలు చేయాలని కోరుతూ బీజేపీ నేత, న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సూర్యకాంత్, జస్టిస్ జయమల్య బాగ్చీలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం సోమవారం (ఏప్రిల్ 13) ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పిటిషనర్‌ను మొదట ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించమని ధర్మాసనం సూచించింది. అయితే, ప్రస్తుతం జరుగుతోన్న నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ విధానం అమలు చేయాలని తాము కోరడం లేదని.. భవిష్యత్‌లో జరగబోయే ఎన్నికల్లో ఈ విధానం ఇంప్లిమెంట్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
పిటిషనర్ వాదనతో ఏకీభవించిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించేందుకు అంగీకరించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం, భారత ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. పోలింగ్ కేంద్రాల్లో ఫింగర్ ప్రింట్, ఐరిస్ బయోమెట్రిక్ వ్యవస్థ అమలుపై అభిప్రాయం తెలియజేయాలని ఆదేశించింది.
ప్రస్తుతం జరుగుతోన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల కోసం ఈ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. వచ్చే పార్లమెంటరీ ఎన్నికలు లేదా అసెంబ్లీ ఎన్నికల్లో ఈ విధానాన్ని అనుసరించవచ్చో లేదో పరిశీలించాల్సిన అవసరం ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
