కళ్ల ముందే తయారు చేస్తరు.. నచ్చితే కొనొచ్చు

కళ్ల ముందే తయారు చేస్తరు.. నచ్చితే కొనొచ్చు
  • శిల్పారామంలో గుజరాతీ హస్తకళల ఉత్సవ్​మేళా
  • వచ్చే నెల 5 వ తేదీ వరకు ప్రదర్శన 

హైదరాబాద్, వెలుగు: శిల్పారామంలో ‘ గుజరాత్ హస్తకళల ఉత్సవ్ – 2021’ ఆకట్టుకుంటోంది. ఇండస్ట్రియల్ ఎక్స్ టెన్షన్ కాటేజ్, గుజరాత్ కళాకారుల చేనేత–హస్తకళల ప్రదర్శన పదిరోజులు నిర్వహించనుండగా 93స్టాళ్లను ఏర్పాటు చేశారు. గుజరాత్ కళాకారులు తయారు చేసిన వస్తువులు మాత్రమే అందుబాటులో ఉంటాయి. హ్యాండ్లూమ్, హ్యాండీ క్రాఫ్ట్స్ కళాకారులకు తమ వస్తువులను అమ్ముకునేందుకు ఒక మార్కెటింగ్ ప్లాట్ ఫారమ్ ని అందించామని శిల్పారామం అధికారి తెలిపారు. ఈనెల 25 న ప్రారంభమవగా, ప్రతిరోజు ఉదయం 10.30గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఉంటుంది. 

లైవ్ లో చేసి చూపిస్తూ.. 
హ్యాండ్ మేడ్ వస్తువులను చూసినప్పుడు వాటిని ఎలా చేస్తారనే ఆసక్తి చాలామందికి ఉంటుంది.  పటోలా, షాల్ నేయడం, కుట్చి–ఎంబ్రాయిడరీ, అర్జాఖ్ బ్లాక్ ప్రింట్, టై అండ్ డై (బంధేజ్), జరీ– జర్దోసీ వర్క్, బీడ్ వర్క్, చెక్క, మెటల్ వంటితో క్రాఫ్ట్ తయారు చేసి ప్రదర్శిస్తున్నారు. హ్యాండ్ మేడ్ ఆర్ట్ వర్క్ వస్తువులు, జువెలరీ, యాక్సెసరీస్, నెయిల్ పెయింటింగ్, హోమ్ డేకర్,  లెదర్ వర్క్ పటోలా చీర, వార్లీ పెయింటింగ్ వంటివి చేసి సందర్శకులకు చూపిస్తున్నారు. గుజరాత్​లోని వివిధ ప్రాంతాల నుంచి 90మందికి పైగా మాస్టర్ క్రాఫ్ట్ మెన్ లు తయారు చేస్తున్నారు.