‘పబ్ జీ’ ఆడినందుకు గుజరాత్ లో 10మంది అరెస్ట్​

‘పబ్ జీ’ ఆడినందుకు గుజరాత్ లో 10మంది అరెస్ట్​

‘‘పబ్లిగ్గా పబ్ జీ ఆడతారా..? మీ భరతం పడతాం” అంటున్నారు పోలీసులు. చెప్పడం కాదు.. చేతల్లో చూపించారు. పది మందిని అరెస్ట్ చేశారు. గుజరాత్ లోని రాజ్ కోట్ లో జరిగిందీ ఘటన. ఇప్పటికే పబ్ జీపై నిషేధం విధించింది గుజరాత్ ప్రభుత్వం . రాజ్ కోట్ కమిషనర్ కూడా దానిపై అధికారికంగా ఆదేశాలు జారీ చేశారు. అయినా కూడా యువత గేమ్ ను వదలట్లేదు. ఈ నేపథ్యంలోనే కొందరు యువకులు బహిరంగంగా మొబైల్ లో పబ్ జీ ఆడుతుండడాన్ని పోలీసులు చూశారు. వెంటనే అరెస్ట్ చేశారు. పోలీస్ కమిషనర్ ఆదేశాలను పట్టించుకోనందుకు సెక్షన్ 188, పబ్ జీని నిషేధించినా ఆడుతుండడంపై గుజరాత్ పోలీస్ చట్టం ప్రకారం సెక్షన్ 35 ప్రకారం వారిపై కేసులు నమోదు చేశారు. ఇప్పటిదాకా 12 కేసులు నమోదు చేసినట్టు రాజ్ కోట్ కమిషనర్ మనోజ్ అగర్వాల్ తెలిపారు. ఇది బెయిలబుల్ నేరమని చెప్పారు. అరెస్ట్ చేసినా బెయిల్ తో బయటకు పంపిస్తున్నామని చెప్పారు. వారిని కోర్టుకు తీసుకెళతామని స్పష్టం చేశారు. ఆడడమేకాదు.. ఆడుతున్న వారి గురించి పోలీసులకు చెప్పకపోయినా నేరమేనని మనోజ్ అగర్వాల్ చెప్పారు. తల్లిదండ్రులు, టీచర్లూ బాధ్యతగా చూసుకోవాల్సిన అవసరముందన్నారు. గేమ్ ఆడుతూ పట్టుబడిన వారి వద్ద నుంచి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెబుతున్నారు. తాము వస్తున్న విషయమూ ఆ యువకులు పట్టించుకోలేదని, అంతలా ఆ ఆటలో లీనమైపోయారని, రెడ్ హ్యాండెడ్ గా వారిని పట్టుకున్నామని స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ పోలీసులు తెలిపారు. పబ్ జీ వల్ల విద్యార్థుల చదువులు పాడైపోతున్నాయని, ఆ గేమ్ లోని హింస వల్ల పిల్లల వైఖరిలోనూ మార్పులొస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. చిన్నపిల్లలే గాకుండా పెద్దవాళ్లకూ అదో వ్యసనంలా పట్టుకుంటోందని అంటున్నారు. ఈ గేమ్‌‌ వల్ల ఎన్నెన్నో అనర్థాలూ జరుగుతున్నాయి. పబ్ జీ ఆడుతూ జమ్మూకు చెందిన ఓ ఫిట్ నెస్ ట్రైనర్ తనను తానే గాయపరుచుకున్నాడు. పబ్ జీ కోసం స్మార్ట్ ఫోన్ కొనివ్వనందుకు ముంబైలో ఓ టీనేజర్ ఆత్మహత్య చేసుకున్నాడు . అంతేకాదు.. పబ్ జీ కోసం ప్రెగ్నెంట్ అయిన భార్యను , కుటుంబాన్నే వదిలేశాడు మలేసియాకు చెందిన ఓ ప్రబుద్ధుడు.