
హైదరాబాద్: ఇటీవల చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 17 మంది మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. యావత్ రాష్ట్రాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని విచారణకు ఆదేశించింది. దీంతో ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఈ క్రమంలోనే గుల్జర్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనపై అగ్నిమాపక శాఖ అధికారులు ఒక నిర్ధారణకు వచ్చారు. ఇన్వర్టర్లో ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే గుల్జర్ హౌస్ ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. అగ్ని ప్రమాదం జరిగిన టైంలో ఇంట్లో రెగ్యులర్ కరెంట్ ఆఫ్ ఉన్నట్టు గుర్తించిన అధికారులు.. ఇన్వర్టర్ ద్వారా సెకండరీ పవర్ సప్లై మాత్రమే ఉన్నట్లు నిర్ధారించారు.
హైదరాబాద్‌తో పాటు నాగపూర్‌కు చెందిన ఫైర్ ఫోరెన్సిక్ ఇంజనీర్లు కూడా ఇదే విషయాన్ని నిర్ధారించారు. ఘటన స్థలాన్ని పరిశీలించి పూర్తి నివేదికను ఫైర్ డీజీకి అందించనున్నారు. మరో వైపు అగ్ని ప్రమాదం జరిగాక పొగ ఎక్కువగా వ్యాపించడంతో బయటికి రాకుండా రూమ్‌లోనే ఉండి తలుపులు వేసుకున్న కుటుంబ సభ్యులు.. పొగను పీల్చి సృహా తప్పి పడిపోయారని గుర్తించారు. దీంతో మృతులు ఊపిరి ఆడక చనిపోయినట్టు అగ్నిమాపక శాఖ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.