- ఎస్సీ గురుకులాల నుంచి 163 మంది విద్యార్థులు ఎంపిక
హైదరాబాద్, వెలుగు: జేఈఈ అడ్వాన్స్ ఫలితాల్లో గురుకుల స్టూడెంట్స్ సత్తా చాటారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల నుంచి ఎక్కువ మంది స్టూడెంట్స్ కు ర్యాంకులు దక్కాయి. ఎస్సీ గురుకులాల నుంచి జేఈఈ మెయిన్స్-2026 పరీక్షకు మొత్తం 355 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, ఇందులో 163 మంది విద్యార్థులు ఐఐటీలో సీట్లు సాధించినట్లు ఎస్సీ గురుకుల సెక్రటరీ విజయేంద్ర బోయి తెలిపారు.
500 లోపు ఒకరు, వెయ్యి లోపు ముగ్గురు, 2వేల లోపు 14 మంది, 3వేల లోపు 25 మంది, 5వేల లోపు 39 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించినట్లు ప్రకటించారు. చిలుకూరు బాయ్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు చెందిన పీ. హేమంత్ ఎస్టీ కేటగిరీలో ఆల్ ఇండియా కమ్యూనిటీ ర్యాంక్-200 సాధించినట్లు ఆమె వెల్లడించారు. ఎస్టీ గురుకులాల నుంచి 133 మందికి ర్యాంకులు జేఈఈ అడ్వాన్స్ ఫలితాల్లో ఎస్టీ గురుకులాల నుంచి 133 మంది ర్యాంకులు సాధించినట్లు సెక్రటరీ సీతాలక్ష్మి ప్రకటించారు. ఈ ఎంట్రన్స్ కు మొత్తం 208 మందికి ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వగా.. ఓపెన్ కేటగిరీలో ఇద్దరు, టాప్ వెయ్యిలో 10 మందితో పాటు మొత్తం 81 మంది విద్యార్థులకు ఐఐటీల్లో సీట్లు పొందే అవకాశం ఉందని సెక్రటరీ వెల్లడించారు.
బీసీ గురుకులాల నుంచి 25 మంది..
బీసీ గురుకులాల నుంచి జేఈఈ అడ్వాన్స్ ఫలితాల్లో ట్రిబుల్ ఐటీలకు 25 మంది ఎంపికైనట్లు ఇన్ చార్జి సెక్రటరీ మల్లయ్య భట్టు తెలిపారు. జాతీయ స్థాయి ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలో విద్యార్థులు సాధించిన ఈ విజయం వారి కృషికి, అధ్యాపకుల అంకితభావానికి నిదర్శనమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
