- బీజేపీ నేత నరసింహారావు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని, అభివృద్ధి మాత్రం శూన్యమని మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం మీడియాతో ఆయన మాట్లాడారు. తెలంగాణకు బడ్జెట్ కేటాయింపుల్లో జీరో నిధులు అంటూ ప్రచారం చేయడం కరక్ట్ కాదన్నారు. ఈ బడ్జెట్ దేశం అగ్రగామిగా, గొప్ప ఆర్థిక శక్తిగా ఎదగడానికి పునాదులు వేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి స్కామ్స్, స్కీమ్స్ తప్ప రాష్ట్ర అభివృద్ధిపై స్పష్టమైన ప్రతిపాదన లేదని విమర్శించారు.
గత యూపీయే బడ్జెట్ల కన్నా మూడు రెట్లు అధికంగా బడ్జెట్ ఉందని తెలిపారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ అవినీతే తెలంగాణను తీవ్రంగా ముంచాయని మండిపడ్డారు. చాలా రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ నుంచి ట్రిబుల్ ఇంజన్ సర్కార్ గా బీజేపీ పాలన కొనసాగుతోందన్నారు. కాంగ్రెస్ పాలనలో కోల్ కాంట్రాక్ట్ కోసం మంత్రులు కొట్టుకుంటున్నారని ఆరోపించారు. అవినీతి మరకల నుంచి తప్పించుకోవడానికి రాష్ట్ర మంత్రులు ప్రయత్నం చేస్తున్నారని విరుచుకుపడ్డారు.
