హైదరాబాద్, వెలుగు: న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ హత్య కేసులో నిందితులకు చెందిన బంధువులను అక్రమంగా నిర్బంధించి వేధింపులకు గురి చేస్తున్నారంటూ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలైంది. న్యాయవాది హత్య కేసులో ప్రధాన నిందితులైన హసన్ బిన్ అలీ యాఫై, మునీర్ అహమ్మద్‌ల తరఫున సయ్యద్ సాదిక్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ నగేశ్ భీమపాక, జస్టిస్ వాకిటి రామకృష్ణారెడ్డిలతో కూడిన బెంచ్ విచారణ చేపట్టింది.
పిటిషనర్ తరఫు న్యాయవాది వాదిస్తూ..హత్య కేసులో హసన్ బిన్ అలీ యాఫై, మునీరుద్దీన్‌ల తల్లిదండ్రులను, ఇతర కుటుంబసభ్యులను అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలకు గురి చేస్తున్నారన్నారు. వారిని కోర్టు ముందు హాజరుపరచేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. నిందితుల్లో వృత్తిరీత్యా మెకానిక్‌గా ఉన్న హసన్ బిన్ అలీ తల్లి అక్తర్ ఉన్నీసా బేగం, భార్య సఫీనా ఖాతూన్, సోదరుడు ఒమర్ బిన్ అలీ యాఫై, కుమారుడు ఈసా బిన్ హసన్ యాఫైలు పోలీసుల నిర్బంధంలో ఉన్నారని పేర్కొన్నారు. వారిని అక్రమంగా నిర్బంధించి ప్రాథమిక హక్కులకు భంగం కలిగించినందున పరిహారం ఇప్పించాలన్నారు. వాదనలను విన్న ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులకు నిరాకరిస్తూ విచారణను జూన్ 4కు వాయిదా వేసింది
