న్యూఢిల్లీ: ఇరాన్ – అమెరికా యుద్ధం కారణంగా ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధరలు భారీగా పెరగడంతో హజ్ యాత్రికుల విమాన చార్జ్‌పై అదనంగా రూ.10 వేలు పెంచుతూ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది. కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో పనిచేసే హజ్ కమిటీ తీసుకున్న ఈ నిర్ణయంపై యాత్రికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీన్ని వెనక్కి తీసుకోవాలని ప్రతిపక్షాలు సైతం డిమాండ్ చేస్తున్నాయి.
ప్రభుత్వ సర్క్యులర్ ప్రకారం.. ఫిబ్రవరి 28 నుంచి ఇరాన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత గ్లోబల్ ఏటీఎఫ్ ధరలు రెండింతలు పెరిగాయి. విమానయాన సంస్థల ఆపరేటింగ్ ఖర్చుల్లో 30 నుంచి -40 శాతం వరకు ఇంధన ఖర్చులే ఉండటంతో ఈ పెంపు తప్పనిసరి అయిందని ప్రభుత్వం చెబుతున్నది. ఈ నేపథ్యంలో ప్రతి యాత్రికుడు అదనంగా సుమారు 100 అమెరికన్ డాలర్లు (రూ.10 వేలు) చెల్లించాలని నిర్ణయించింది. మే 15లోగా ఈ మొత్తాన్ని చెల్లించాలని హజ్ కమిటీ సూచించింది.
ఇంత భారమా.. అన్యాయం..
హజ్‌కమిటీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వ్యతిరేకించారు. ఇప్పటికే ఒక్కో యాత్రికుడి నుంచి భారీగా వసూలు చేసిన తర్వాత మళ్లీ అదనపు భారం వేయడం అన్యాయమని అన్నారు. హజ్ యాత్ర విలాసం కాదని, చాలా మంది సంవత్సరాల పాటు డబ్బు కూడబెట్టుకుని వెళ్తారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ప్రతాప్గాత్రి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
