నేతన్నలకు నెలకు రూ.2వేలు కూడా  రాని దుస్థితి

 నేతన్నలకు నెలకు రూ.2వేలు కూడా  రాని దుస్థితి

పిడికి రూ.13, రోజంతా చేస్తే రూ.80
 నెలకు రూ.2వేలు కూడా రాని దుస్థితి


కమలాపూర్, వెలుగు:  కుల వృత్తిని కాదని వేరే పనికి వెళ్లని మనస్తత్వం వారిది. బొక్కలు తేలినా, ఎముకలు గుల్లగా మారినా నమ్ముకున్న చేనేత రంగాన్ని వదిలిపెట్టరు. కష్టమైనా, నష్టమైనా.. నొప్పి వచ్చినా.. రోగమొచ్చినా పనిని మాత్రం వదిలిపెట్టలేరు. అష్టకష్టాలు పడి బట్టను నేస్తే.. వచ్చే జీతం మాత్రం అరకొరే. పిడికి రూ.13, రోజంతా చేస్తే రూ.80.. నెలకు రూ.2వేలు కూడా రాని పరిస్థితి. ట్రెండ్​కు తగ్గట్టుగా బట్ట నేసినా గదే కూలీ. ఇదీ కమలాపూర్ నేతన్నల పరిస్థితి.
గిట్టుబాటు అయితలేదు..
కమలాపూర్ మండలకేంద్రంలో 1950లో చేనేత సహకార సంఘం ఏర్పడింది. కమలాపూర్ తో పాటు మర్రిపెల్లి గూడెం గ్రామంలోనూ చేనేత సంఘం ఉంది. ఆయా సంఘాల్లో మొత్తం 692 సభ్యులు ఉండగా, 370 మంది ప్రస్తుతం పనిచేస్తున్నారు. 71 ఏండ్లుగా సంఘం ఆధ్వర్యంలో టవళ్లు, చద్దర్లు, లుంగీలు, జంకానాలు, దోమల తెరలతో పాటు ఇటీవల ఖరీదైన చీరెలు, జీన్స్ పాయింట్లు, అంగి బట్టలు కూడా నేస్తున్నారు. ఎన్ని వెరైటీలు నేసినా కూలీలకు మాత్రం గిట్టుబాటు దక్కడం లేదు. వారికొచ్చే సంపాదనతో ఇల్లు గడవడం కూడా కష్టంగా మారింది.
ఖరీదైనవి నేసినా అదే రేటు..
సంప్రదాయానికి భిన్నంగా నేతన్నలు బట్టలు తయారు చేస్తున్నా.. కూలీ రేట్లలో మార్పు ఉండడం లేదు. సరికొత్తగా హిమ్రు చీరె, జీన్స్​నేసినా అవే పైసలు ఇస్తున్నరు. ఏడాది కింద కమలాపూర్ లోనే మొట్టమొదటి సారిగా హిమ్రూ చీరెను నేయగా.. మార్కెట్​లో రూ.8వేల నుంచి రూ.9వేలు పలికింది. ఇటీవల తయారు చేసిన జీన్స్ క్లాత్​హోల్​సేల్​లో రూ.250, రిటైల్​లో రూ.300 అమ్ముడుపోయింది. ఇతర జిల్లాల నుంచి వచ్చి మరీ ఇక్కడి ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. కార్మికులు పొద్దంతా కష్టపడి వీటిని నేస్తుండగా.. అదే కూలీ ఇస్తున్నారు. ఇదిలా ఉండగా.. చేసిన పనికి తగిన కూలీ రాకపోవడంతో పలువురు నేతన్నలు వలస వెళ్తున్నారు. ఇంటి పెద్దలు తమ  పిల్లలను వదిలిపెట్టి, పని కోసం ఇతర రాష్ర్టాలకు వెళ్తున్నారు. సూరత్, భీవండి, సిరిసిల్ల వంటి ప్రాంతాలకు వెళ్లి, అక్కడ కాయకష్టం చేసి ఇంటికి పైసలు పంపుతున్నరు. సొంత గ్రామాన్ని వదిలిపెట్టి వెళ్లలేని వారు మాత్రం కష్టమైనా ఇక్కడే పనిచేస్తున్నరు.
నెలంతా చేస్తే రూ.2 వేలే..
చేనేత సంఘాల ఆధ్వర్యంలో పనిచేస్తున్న నేతన్నల జీతాలు నెలకు రూ.2వేలు దాటడం లేదు. టెస్కో సంస్థ సైతం జీతాలు పెంపుపై ఆలోచించడం లేదు. గత నాలుగేండ్లుగా ఇదే పరిస్థితి ఉంది. కార్మికుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నట్లు చెబుతున్న సర్కారు.. క్షేత్రస్థాయిలో మాత్రం నేతన్నలను పట్టించుకోవడం లేదు. కూలీ గిట్టక, ఆర్థిక ఇబ్బందులతో అవస్థలు పడుతున్నా.. ఆఫీసర్లు, లీడర్లు పట్టించుకోవడం లేదని చేనేత కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.