గచ్చిబౌలి, వెలుగు: క్రెడిట్‌కార్డులు, లోన్లు తీసుకుని కట్టకపోతే రికవరీ ఏజెంట్ల వేధింపులు మామూలుగా ఉండవు. ఇంటికి వచ్చి గొడవ చేయడం, పరువు తీయడం, భర్త లోన్ తీసుకుంటే భార్యకు, భార్య తీసుకుంటే భర్తకు కాల్స్ చేసి సతాయించడం, బంధువులకూ ఫోన్లు చేసి చెప్పడం జరుగుతున్నదే..కానీ, సైబరాబాద్ కమిషరేట్ పరిధిలో ఓ మహిళ లోన్తీసుకుని కట్టినా..అదనపు డబ్బులు డిమాండ్‌చేస్తూ రికవరీ ఏజెంట్లు మానసిక హింసకు గురి చేశారు. 15 నెలల్లో ఆమె 57 లోన్ యాప్స్ నుంచి సుమారు 83 లక్షలు తీసుకోగా, రూ. కోటి ఐదు లక్షల వరకు తిరిగి కట్టింది.
అయినా అదనపు డబ్బులు డిమాండ్‌చేయడంతో మరో రూ.22 లక్షలు చెల్లించింది. ఊరుకోని ఏజెంట్లు ఇంకా కట్టాలంటూ బూతులు తిడుతూ సోషల్ మీడియాలో న్యూడ్ ఫోటోలు అప్లోడ్ చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. ఏకంగా 105 మొబైల్ నంబర్స్ నుంచి రాత్రి, పగలు తేడా లేకుండా కాల్స్ చేశారు. ఓటీపీలు పంపారు. చివరకు ఆమె ఫొటోలు మార్ఫింగ్చేసి ఆమె తల్లికి, చెల్లికి పంపుతామని అనడంతో సైబరాబాద్సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది.
లెక్క సరిపోలేదంటూ..
సైబరాబాద్ కమిషనరేట్పరిధిలోని బాచుపల్లికి చెందిన మహిళ (32) ఓ ప్రైవేట్ ఎంప్లాయ్. తన అవసరాల కోసం నవంబర్2024 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 57 లోన్‌యాప్స్ నుంచి రూ. 83,83,179 లోన్ తీసుకుంది. వడ్డీతో కలిపి రూ. కోటి ఐదు లక్షలు చెల్లించింది. అయినా రికవరీ ఏజెంట్లు అదనపు వడ్డీ చెల్లించాలన్నారు. ఒప్పుకోకపోవడంతో కాల్స్‌చేసి వేధించడం మొదలుపెట్టారు. దీంతో మరికొన్ని లోన్‌యాప్స్‌లో లోన్ తీసుకుని మరో రూ.22 లక్షలు కూడా కట్టింది. అయినా లెక్క సరిపోవడం లేదని మరిన్ని డబ్బులు కట్టాలని మెసేజ్‌లు పంపడం, కాల్స్ చేశారు.
‘ఆమె ఒక మోసగత్తె...జాగ్రత్త’
ఆమె ఫోన్లోని ఫొటోలను మార్ఫింగ్ చేసి ‘ఫ్రాడ్పర్సన్’ అని క్యాప్షన్ ఇచ్చి కాంటాక్ట్ లిస్ట్‌లోని అన్ని నంబర్లకు పంపించారు. పచ్చి బూతులు తిడుతూ ఆమెకు, ఆమె ఫ్రెండ్స్‌కు మెసేజ్‌లు పంపారు. ఆమె బ్యాంక్ఎకౌంట్డిటెయిల్స్తెలుసుకుని ఎవరైతే డబ్బులు పంపుతున్నారో వాళ్లకు కాల్స్‌చేసి ‘ఆమె ఒక మోసగత్తె. మా దగ్గర డబ్బులు తీసుకుని ఎగ్గొట్టింది. మీకు కూడా అలాగే చేస్తుంది’ అని తప్పుడు ప్రచారం చేశారు.
105 మొబైల్ నంబర్స్ నుంచి ఏకధాటి కాల్స్
ఆర్బీఐ గైడ్లైన్స్ప్రకారం.. ఉదయం 8 గంటల్లోపు..రాత్రి 7 తర్వాత కాల్స్ చేయొద్దని నిబంధనలు ఉన్నా 24 గంటలూ కాల్స్‌తో పాటు నాన్‌స్టాప్ మెసేజెస్‌తో విసిగించారు. రోజూ ఆపకుండా ఒకదాని తర్వాత మరొకటి ఇలా సుమారు 1500 ఓటీపీలను ఆమె ఫోన్‌కు , ఫ్రెండ్స్ ఫోన్లకు పంపించి నరకం చూపించారు. ఇలా ఒక్కటి కాదు ఏకంగా 105 మొబైల్ నంబర్స్ నుంచి కాల్స్ చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఆమె లింక్డ్ఇన్ప్రొఫైల్స్ఆక్సెస్తీసుకుని పని చేసే ఆఫీసులోని బాస్‌కు, కొలిగ్స్‌కు ఫోన్‌చేసి పరువు తీశారు. ఆమె ఫొటోలు, ఆమె లోన్వివరాలు హెచ్ఆర్మేనేజర్కు పంపి డబ్బులు కట్టించాలంటూ మెసేజ్‌లు పెట్టారు. దీంతో వారు ‘ఇంకోసారి కాల్స్వస్తే నువ్వు ఉద్యోగం మానెయ్’ అని చెప్పేశారు. దీంతో ఆమె డిప్రెషన్లోకి వెళ్లిపోయింది.
మీ అమ్మకు, చెల్లికి నీ నగ్న ఫొటోలు పంపుతం
ఇంత చేసినా సదరు మహిళ అదనపు డబ్బులు కట్టడానికి ఒప్పుకోకపోవడంతో ఆమె ఫోన్, సోషల్‌మీడియాలోని ఫొటోలను మార్ఫింగ్చేసి ఆమె తల్లికి, చెల్లికి పంపుతామని బెదిరించారు. వాటిని సోషల్ మీడియాలో కూడా అప్లోడ్ చేస్తామని వార్నింగ్ఇచ్చారు. దీంతో ఆమె సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసును ఆశ్రయించింది. లోన్ యాప్స్ తీసుకున్న డబ్బులకు అదనంగా రూ. 22 లక్షలు కట్టినా, వేధిస్తున్నారని, తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేసింది.
ఫోన్ హ్యాక్ చేసి..
యాప్స్ నుంచి లోన్ తీసుకున్నప్పుడు, లేదా క్రెడిట్ కార్డులు వాడుతున్నప్పుడు ఆయా యాప్స్‌లో అన్ని యాక్సెస్‌లు అంటే కాంటాక్ట్ లిస్ట్, ఫొటోలు, కెమెరా పర్మిషన్స్ ఇవ్వడాన్ని రికవరీ ఏజెంట్లు అడ్వాంటేజ్‌గా తీసుకుంటున్నారు. సదరు మహిళ కూడా 57 లోన్ యాప్స్‌కు అన్ని పర్మిషన్స్ ఇవ్వడంతో ఆమె కాంటాక్ట్ లిస్ట్ యాక్సెస్ తీసుకున్నారు. అలాగే కొందరు ఏజెంట్లు ఆమె ఫోన్‌ను హ్యాక్ చేశారు.
