న్యూఢిల్లీ: ప్రస్తుతం ఉన్న టీమిండియా సెలెక్షన్ కమిటీని.. బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ మారుస్తాడని వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. బలమైన వ్యక్తులు కమిటీ పగ్గాలు చేపట్టాలన్నాడు. కేరళ ప్లేయర్ సంజూ శాంసన్‌ను.. విండీస్‌తో టీ20 సిరీస్‌కు ఎంపిక చేయకపోవడంపై స్పందించిన భజ్జీ పై వ్యాఖ్యలు చేశాడు. బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు శాంసన్ ఎంపికైనా ఒక్క మ్యాచ్ కూడా ఆడే చాన్స్ దక్కలేదు. ‘సెలెక్టర్లు శాంసన్‌ను పరీక్షిస్తున్నారని అనుకుంటున్నా. ప్యానెల్‌ను మార్చాల్సిన అవసరం ఉంది. ఇందులోకి పెద్ద వ్యక్తులు రావాలి. దాదా ఇందుకు అవసరమైన చర్యలు చేపడతాడని ఆశిస్తున్నా’ అని భజ్జీ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 చాంపియన్‌షిప్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన శాంసన్ 112 రన్స్ చేశాడు. అయినా సెలెక్టర్లు పట్టించుకోలేదు. 2015లో శాంసన్.. జింబాబ్వేపై ఒకే ఒక్క టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాడు.


