కాంగ్రెస్ పాలనలోనే కృష్ణా జలాల అతి తక్కువ వాడకం : హరీశ్ రావు

కాంగ్రెస్ పాలనలోనే కృష్ణా జలాల అతి తక్కువ వాడకం : హరీశ్ రావు
  • ఏపీ వినియోగం 75 శాతానికి పెరిగితే, మనది 25 శాతానికి పడిపోయింది 

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ పాలనలో కృష్ణా నీటి వినియోగం ఎంత జరిగిందనే కనీస అవగాహన సీఎం రేవంత్ రెడ్డికి లేకపోవడం పాలమూరుకే కాకుండా యావత్ తెలంగాణకు దురదృష్టకరమని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్ పాలనలో కృష్ణా జలాల వినియోగం కనిష్ట స్థాయికి దిగజారిందన్నారు. నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా కనీస అవగాహన లేదా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం రాసిన అధికారిక లేఖల్లో ఏం ఉందో తెలియదా? అని నిలదీశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన సీఎం రేవంత్‌‌‌‌కు లేఖ రాశారు.

“మే 2న తెలంగాణ ఈఎన్సీ జనరల్  కృష్ణా బోర్డుకు లేఖ రాసింది నిజం. తెలంగాణకు కేటాయించిన తాత్కాలిక వాటా 34% కాగా, ఆంధ్రప్రదేశ్‌‌‌‌కు 66%. 2024–25లో ఏపీ 72.73% నీటిని వినియోగించగా, తెలంగాణ 27.27% మాత్రమే వినియోగించింది. 2025 –-26లో ఏపీ వినియోగం 74.90శాతానికి పెరగగా, తెలంగాణ వినియోగం 25.10 శాతానికి పడిపోయింది. నీటి లభ్యత అధికంగా ఉన్నప్పటికీ తెలంగాణ తన వాటా నీటిని పూర్తిగా వినియోగించుకోలేకపోయింది. పాలమూరు బిడ్డ అని చెప్పుకునే రేవంత్ రెడ్డి రెండున్నరేండ్ల పాలనలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు చేసింది గుండు సున్నా. ఏడాదికి ఆరు లక్షల ఎకరాల చొప్పున , రెండేండ్లలో 12 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పి మాట తప్పిన రేవంత్ రెడ్డికి ఇరిగేషన్ గురించి మాట్లాడే హక్కు లేదు” అని హరీశ్‌‌‌‌ విమర్శించారు. 

లిఫ్టులపై సర్కార్ నిర్లక్ష్యం

లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని హరీశ్ విమర్శించారు. కాళేశ్వరం గాయత్రి పంపింగ్ స్టేషన్‌‌‌‌తో పాటు దేవాదుల తదితర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో పంపులు, మోటార్లు దెబ్బతిన్నాయని, భారీ మోటార్లను పదేపదే ఆన్-ఆఫ్ చేయడం వల్ల పరికరాలు దెబ్బతింటాయని ముందుగానే హెచ్చరించినప్పటికీ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని విమర్శించారు.

“సోలార్ విద్యుత్ అందుబాటులో ఉండే పగటి వేళల్లోనే లిఫ్ట్ ఇరిగేషన్ పంపులు నడపాలని ట్రాన్స్‌‌‌‌కో చెప్పడం వల్ల, పంపులను తరచూ స్టార్ట్, స్టాప్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పంపులు, మోటార్ల నష్టం ఈ విధానాల వల్ల జరిగి ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందే. సోలార్ విద్యుత్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే అందుబాటులో ఉంటుంది. విద్యుత్ లభ్యత ఆధారంగా పంపింగ్‌‌‌‌ను పరిమితం చేయడం రాష్ట్ర జల హక్కులకు విరుద్ధం” అని లేఖలో ఆయన పేర్కొన్నారు.