మంచి ఉద్యోగం వస్తేనే చేస్తమనడం సరికాదు

మంచి ఉద్యోగం వస్తేనే చేస్తమనడం సరికాదు
  • చాలా మంది ఐఏఎస్​ల పిల్లలు ప్రైవేట్ ఉద్యోగాలే చేస్తరు
  • ఆర్థిక మంత్రి హరీశ్​రావు కామెంట్

హైదరాబాద్, వెలుగు: అభివృద్ధిలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం అక్షరాస్యతలో వెనుకబడటం బాధాకరమని ఆర్థిక మంత్రి హరీశ్​రావు అన్నారు. సీఎం కేసీఆర్ ‘ఈచ్ వన్ టీచ్ వన్’ పిలుపులో భాగంగా వంద శాతం అక్షరాస్యత కోసం ప్రైవేట్ ఉద్యోగులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇందుకు ప్రతి ఒక్కరూ సైనికుల్లా పని చేయాలని సూచించారు. గురువారం నాంపల్లి ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం న్యూ ఇయర్ డైరీ, క్యాలెండర్ ను హరీశ్ ఆవిష్కరించారు. తర్వాత మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్నే సాధించుకున్నామని, వంద శాతం అక్షరాస్యత సాధించడం కష్టమేమి కాదని అన్నారు. ప్రైవేటు ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రైవేట్ ఉద్యోగులకు అనేక సమస్యలు ఉన్నాయని, ప్రైవేట్ రంగంలో ఉద్యోగుల హక్కులు కాపాడం కోసం కృషి చేస్తానన్నారు. ప్రైవేట్ మహిళా ఉద్యోగులకు మెటర్నిటీ లివ్ ల విషయంలో సీఎంతో మాట్లాడుతానన్నారు. ‘‘యువకులు మంచి ఉద్యోగం వస్తేనే చేస్తా.. పనిని బట్టి ఉద్యోగం చేస్తా.. అనటం సరికాదు. పేరు పెద్దగా ఉండి జీతం తక్కువ ఉంటే ఏం లాభం” అని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో కూడా బీహార్ నుండి ఇక్కడకు వచ్చి పని చేస్తున్నారన్నారు. చాలా మంది ఐఏఎస్ ల కొడుకులు, కూతుర్లు ప్రైవేట్ ఉద్యోగాలే ఎక్కువ చేస్తారని చెప్పారు.

డైరీ ఆవిష్కరణలు.. ఉద్యమ వేదికలు

డైరీ ఆవిష్కరణలు అంటేనే తెలంగాణ ఉద్యమ వేదికలని, నాటి ఉద్యమానికి డైరీ ఆవిష్కరణలు అద్భుతంగా తోడ్పడ్డాయని హరీశ్ గుర్తు చేశారు. జనవరి అంటేనే డైరీల ఆవిష్కరణలతో గడిచిపోయేదన్నారు. ఉద్యమంలో ఈ వేదిక నుంచే వందల డైరీల ఆవిష్కరణ జరిగిందని చెప్పారు. 2008లో కేసీఆర్ ఆశీస్సులతో ప్రైవేట్ ఉద్యోగుల సంఘం ఏర్పాటైందన్నారు. ఉద్యమ విస్తరణకు ప్రైవేటు ఉద్యోగుల సంఘం సాయపడిందన్నారు. పని ఏదైనా దాన్ని చాలెంజ్ గా తీసుకోవాలని, పనిని బట్టే గుర్తింపు తప్ప పదవిని బట్టి కాదన్నారు. ఇంజనీరింగ్ చేసిన వారు కూడా పొందని జీతం ఓ మేస్త్రి సంపాదిస్తున్నాడని అన్నారు. రాష్ట్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం శర వేగంగా జరుగుతోందని చెప్పారు.

ప్రభుత్వ కొలువులు తక్కువుంటయ్: శ్రీనివాస్ గౌడ్

ఎక్కువ మంది చేసేది ప్రైవేట్ ఉద్యోగాలేనని, ప్రభుత్వ ఉద్యోగాలు తక్కువుంటాయని పర్యాటక మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక హైదరాబాద్ లో పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు వచ్చాయని, వాటిలో 2 లక్షల ఉద్యోగాలు లభించాయన్నారు. చదివిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం రాదని, ప్రైవేట్ రంగంలో ఎక్కువ ఉద్యోగాలు ఉంటాయని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ చెప్పారు. ప్రైవేట్ ఉద్యోగులు ఎక్కువ గంటలు పనిచేస్తూ, కష్టపడతారని, కానీ జీతాలు తక్కువగా ఉంటాయని అన్నారు.