సంగారెడ్డి/జిన్నారం, వెలుగు: ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయకుండానే కాంగ్రెస్ మరోసారి ప్రజల వద్దకు ఓట్లు అడగడానికి వస్తోందని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మాదారం, గుమ్మడిదలలో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు.
ప్రజలకు ఉపయోగపడే పనులు చేయకుండా రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ఆయన ప్రసంగాలను ప్రజలు చూడటం మానేశారని ఎద్దేవా చేశారు. ఎరువులు, కరెంటు సమస్యలు తీరాలంటే, పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు, బీఆర్ఎస్ నాయకులు ఆదర్శ్ రెడ్డి, బాల్‌రెడ్డి, వెంకటేశం గౌడ్, సురేందర్ గౌడ్ పాల్గొన్నారు.
రేవంత్.. భాష మార్చుకోవాలి..
మెదక్/నర్సాపూర్: సీఎం కేసీఆర్ తన భాష మార్చుకోవాలని హరీశ్రావు సూచించారు. బుధవారం నర్సాపూర్, మెదక్‌లో బీఆర్ఎస్ అభ్యర్థులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పింఛన్ మహాలక్ష్మి పథకాలపై ప్రతిపక్షం అడిగితే సీఎం దురుసుగా మాట్లాడడం సరికాదన్నారు. కేసీఆర్ తెలంగాణ కోసం పదవులు త్యాగం చేశారని, రేవంత్ మాత్రం మోసాలతో ఎదిగారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ప్రాణత్యాగానికి సిద్ధపడ్డారని గుర్తు చేశారు.
