మన ఊరు మన బడి కాంట్రాక్టర్ల ఉసురు తీస్తున్నరు : హరీశ్ రావు

మన ఊరు మన బడి కాంట్రాక్టర్ల ఉసురు తీస్తున్నరు : హరీశ్ రావు
  • రెండున్నరేళ్లుగా 1,500 మంది కాంట్రాక్టర్లకు మొండిచెయ్యి: హరీశ్ రావు
  • బిల్లు చెల్లించాలని అడిగితే అక్రమ కేసులు పెడుతున్నరు 
  • వెంటనే పెండింగ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ హయాంలో పేద విద్యార్థుల కోసం చేపట్టిన మన ఊరు మన బడి పనులకు సంబంధించి.. ప్రభుత్వం 1,500 మంది చిన్న కాంట్రాక్టర్లకు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా కక్ష సాధిస్తుందని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. అప్పులు తెచ్చి పనులు చేసిన వారు నేడు మిత్తీలు కట్టలేక రోడ్డున పడ్డారని, అప్పుల బాధతో ఇప్పటికే పలువురు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న కాంట్రాక్టర్లకు పైసల్లేవంటున్న ప్రభుత్వం.. పెయింటింగ్, బెంచీలు సరఫరా చేసిన బడా కంపెనీలకు రాత్రికి రాత్రే వందల కోట్లు ఎలా విడుదల చేసింది? అని ప్రశ్నించారు.

కమీషన్లు ఇవ్వరనే ఈ చిన్న కాంట్రాక్టర్ల బిల్లులను గాలికి వదిలేశారా అని సీఎం రేవంత్ ను నిలదీశారు. ప్రభుత్వం చిన్న కాంట్రాక్టర్ల ఉసురు తీస్తున్నదని మండిపడ్డారు. పలువురు మన ఊరు మన బడి సివిల్ కాంట్రాక్టర్లు సోమవారం హరీశ్ రావును కలిసి తమ ఆవేదన వ్యక్తం చేశారు. రెండున్నరేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం తమకు బిల్లులు చెల్లించడం లేదని, న్యాయంగా అడిగితే అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందని వారు వాపోయారు. దీనిపై ఆయన ‘ఎక్స్​’లో స్పందించారు.

బిల్లుల కోసం కాంట్రాక్టర్లు ప్రజావాణిలో మొరపెట్టుకున్నా, విద్యాశాఖ అధికారుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగినా ఫలితం లేకుండా పోయిందన్నారు. “సీఎం అపాయింట్మెంట్ ఇవ్వరు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను వేడుకున్నా స్పందన లేదు. చివరికి, సెక్రటేరియెట్​లో ఆర్థిక మంత్రి చాంబర్ ఎదుట నిరసన తెలిపితే.. వారిపై అక్రమ కేసులు పెట్టడం ఈ ప్రభుత్వ దుర్మార్గానికి పరాకాష్ట. వారిపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకోని, వెంటనే బిల్లులను చెల్లించాలి” అని ఆయన డిమాండ్ చేశారు.