- సీఎంగా, విద్యా శాఖ మంత్రిగా రేవంత్ ఫెయిల్యూర్: హరీశ్ రావు
హైదరాబాద్, వెలుగు: రేవంత్ పాలనలో గురుకులాలు విద్యా నిలయాలుగా కాకుండా.. విష సర్పాలకు ఆవాసాలుగా మారుతున్నాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి గురుకులంలో ఇంటర్ విద్యార్థిని అశ్మిత పాము కాటుకు గురై మృత్యువుతో పోరాడుతున్న ఘటన కలచివేసిందని మంగళవారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. సీఎంగా, విద్యాశాఖ మంత్రిగా ఇది రేవంత్ పరిపాలనా వైఫల్యం కాదా? అని ప్రశ్నించారు. హార్వర్డ్‌లో సీఎం కాస్లీ చదువులు చదువుతుంటే.. ఇక్కడ గురుకుల విద్యార్థులు మాత్రం పాము కాట్లకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
‘‘అపరిశుభ్రత కారణంగా నేడు గురుకులాల్లో కుక్క కాట్లు, పాము కాట్లు సాధారణంగా మారిపోవడం అత్యంత దుర్మార్గం. గురుకుల బిడ్డలకు కడుపు నిండా తిండి లేదు.. ప్రాణాలకు రక్షణ లేదు. ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి పతనమవుతున్న గురుకులాలను కాపాడాలి’’ అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
