- ప్రాజెక్ట్ ఎత్తు 45.72 మీటర్లు.. భద్రాచలం మొదటి ప్రమాద హెచ్చరికదీ సేమ్ : హరీశ్ రావు
- ముంపుతో నష్టపోతున్న 2 వేల కుటుంబాలకు వెంటనే పరిహారం ఇవ్వాలి
- ఐదు కిలోమీటర్ల మేర వెంటనే కరకట్టను నిర్మించాలి
- పీపీఏ సీఈవోకు లేఖలో డిమాండ్లు
హైదరాబాద్, వెలుగు : పోలవరం ప్రాజెక్ట్‌తో భద్రాచలానికి జలగండం తప్పదని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు హెచ్చరించారు. పోలవరం పూర్తి స్థాయి ఎత్తు 45.72 మీటర్లని, భద్రాచలం వద్ద మొదటి ప్రమాదహెచ్చరిక స్థాయి కూడా అదే ఎత్తు అని గుర్తు చేశారు. గురువారం ఆయన పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (సీఈవో)కు లేఖ రాశారు. ముంపుతో పదే పదే నష్టపోతున్న రెండు వేల కుటుంబాలకు తక్షణమే నష్టపరిహారంతో పాటు పూర్తిస్థాయి పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. భద్రాచలం డ్రైనేజీ వ్యవస్థకు అనుసంధానంగా ఉన్న 8 అవుట్ ఫాల్ రెగ్యులేటర్లు బ్యాక్ వాటర్ ముప్పును ఎదుర్కొంటున్నాయని, కనుక వరద నీటిని గోదావరిలోకి పంపేందుకు తక్షణమే పంపింగ్ స్టేషన్లు, ట్రీట్‌మెంట్ ప్లాంట్లు నిర్మించాలని కోరారు.
భద్రాచలం వద్ద కొత్తగా ఐదు కిలోమీటర్ల మేర కరకట్టల నిర్మాణం చేపట్టడంతో పాటు, బూర్గంపాడు, సారపాక తదితర ముంపు గ్రామాలకు రక్షణ గోడలు నిర్మించి పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో పోలవరం ముంపు సమస్యల పరిష్కారం, పునరావాస పనుల పర్యవేక్షణ కోసం భద్రాచలంలో వెంటనే ప్రత్యేకంగా పీపీఏ డివిజన్ ఆఫీసును ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఊహించని నష్టం జరిగే అవకాశం
భద్రాచలం వద్ద గోదావరి లోతు 26 మీటర్లు ఉంటుందని, పోలవరం ప్రాజెక్ట్‌తో బ్యాక్‌వాటర్ వల్ల భద్రాచలంలో ఎప్పుడూ 13.15 నుంచి 17.72 మీటర్ల మేర నీళ్లు నిలిచి ఉండే పరిస్థితులు వస్తాయని హరీశ్ రావు అన్నారు. 2021లో కాఫర్ డ్యామ్ పూర్తయిన తర్వాత వచ్చిన బ్యాక్ వాటర్‌తో 2022లో భద్రాచలం, బూర్గంపాడు, సారపాకల్లో భారీ నష్టం జరిగిందని, 40 శాతం మేర భద్రాచలం పట్టణం మునిగిందని, లక్షలాది మంది ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. 2022లో 22 లక్షల క్యూసెక్కులకే ఇంత నష్టం జరిగితే, భవిష్యత్తులో ప్రాజెక్టు డిజైన్ ప్రకారం 36 లక్షల నుంచి 50 లక్షల క్యూసెక్కుల వరద వస్తే తెలంగాణకు ఊహించని ప్రాణ, ఆస్తి నష్టం జరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
కేవలం గ్రామాలకే కాకుండా భారీ పరిశ్రమలకు కూడా బ్యాక్ వాటర్ ముప్పు ఉంటుందని, దాదాపు 5 వేల కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్న ఐటీసీ పేపర్ బోర్డ్స్, హెవీ వాటర్ ప్లాంట్, దుమ్ముగూడెం జలవిద్యుత్ ప్రాజెక్టులకు ప్రమాదం పొంచి ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ పరిశ్రమలతోపాటు 36 గ్రామాల పరిధిలోని 184 చదరపు కిలోమీటర్ల మేర ముంపు ప్రభావం పడుతోందని ఐఐటీ, వ్యాప్కోస్ అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయన్నారు.
ప్రజా పాలన కాదు.. ప్రజలను వంచించే పాలన
హైదరాబాద్ సిటీ, వెలుగు : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన పేరుతో ఊదరగొట్టడం తప్ప.. చేస్తున్నదేం లేదని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఆరోపించారు. ప్రజా పాలన కాదు.. ఇది ప్రజల్ని వంచించే పాలన అంటూ ఎద్దేవా చేశారు. గురువారం హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని బోర్డు కార్యాలయం వద్ద హెచ్‌ఎండబ్ల్యూ ఎస్‌ఎస్‌బీ కామ్ గార్ యూనియన్ గేట్ మీటింగ్ జరిగింది. ఈ కార్యక్రమానికి హరీశ్ రావు హాజరై, మాట్లాడారు. శనివారం జరిగే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థి రాంబాబుయాదవ్ గెలుపు ఖాయమన్నారు.
