జీఆర్‌‌ఎంబీ ఆఫీసును ముట్టడిస్తం...బోర్డు మీటింగ్ ఎజెండాలో ఆ అంశాలను తొలగించాలి: హరీశ్ రావు

జీఆర్‌‌ఎంబీ ఆఫీసును ముట్టడిస్తం...బోర్డు మీటింగ్ ఎజెండాలో ఆ అంశాలను తొలగించాలి:  హరీశ్ రావు

హైదరాబాద్, వెలుగు: జీఆర్‌‌ఎంబీ ఎజెండాలో పెట్టిన అంశాలను తొలగించకుంటే హైదరాబాద్‌లోని బోర్డు ఆఫీసును ముట్టడిస్తామని మాజీ మంత్రి, బీఆర్‌‌ఎస్​డిప్యూటీ ఫ్లోర్​లీడర్​హరీశ్ రావు హెచ్చరించారు. తెలంగాణకు చెందిన ఏడు ప్రాజెక్టులను అడ్డుకోవాలని బోర్డు ఎజెండాలో పొందుపరచడంపై ఆయన శనివారం ఓ ప్రకటనలో అభ్యంతరం వ్యక్తంచేశారు. 

ఇప్పటికే కేంద్ర మంత్రి సీఆర్​ పాటిల్‌కు లేఖ రాశామని తెలిపారు. కాగా, విద్యార్థులు, నిరుద్యోగులంటే ప్రభుత్వానికి ఎందుకంతా కక్ష అని ప్రశ్నించారు. అధికారం కోసం ఎన్నికల సమయంలో విద్యార్థులు, నిరుద్యోగులను నెత్తిన పెట్టుకున్నారని, ఉద్యోగాలు ఇస్తామని హామీలు గుప్పించారని, కానీ, ఇప్పుడు అదే నిరుద్యోగులు ఉద్యోగాల కోసం రోడ్ల మీదకు వస్తే వారిపై ఇంత కర్కశంగా వ్యవహరిస్తారా? అని అడిగారు. హైడ్రాలో కేవలం 150 డ్రైవర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తే వేలాది మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకునేందుకు తరలివచ్చారని, ఇది నిరుద్యోగుల తప్పా? లేక ఉద్యోగాలు కల్పించడంలో విఫలమైన ప్రభుత్వం తప్పా? అని ప్రశ్నించారు. ఉద్యోగం కోసం వచ్చిన యువతను గౌరవంగా చూడాల్సిన అధికారులు వారినే అవమానిస్తే ఇక ఈ ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తున్నట్టని మండిపడ్డారు.