V6 News

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌‌‌‌ గా హరివంశ్... వరుసగా మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నిక

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌‌‌‌ గా హరివంశ్... వరుసగా మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నిక
  • అభినందనలు తెలిపిన రాజ్యసభ చైర్మన్, ప్రధాని మోదీ, నేతలు

న్యూఢిల్లీ: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌‌‌‌గా హరివంశ్ మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్, ప్రధాని నరేంద్ర మోదీ, వివిధ పార్టీల నేతలు ఆయనను అభినందించారు. రాజ్యసభ చైర్మన్ రాధాకృష్ణన్ మాట్లాడుతూ.. హరివంశ్ ఏకగ్రీవ ఎన్నిక ఆయనపై సభకు ఉన్న నమ్మకానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఆయన నిష్పక్షపాతంగా, నిబద్ధతతో విధులను నిర్వర్తిస్తారని కొనియాడారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ.. హరివంశ్ అనుభవానికి, ఆయన పనితీరుకు దక్కిన గౌరవం ఇది అని పేర్కొన్నారు. 

ఆయన నాయకత్వంలో సభ పనితీరు మరింత ప్రభావవంతంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాజ్యసభ ప్రతిపక్షనేత, కాంగ్రెస్​పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. హరివంశ్ ఎన్నిక చరిత్రాత్మకమైనదిగా అభివర్ణించారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవిని చేపట్టిన తొలి నామినేటెడ్ సభ్యుడు ఆయనేనని గుర్తుచేశారు. అయితే, లోక్‌‌‌‌సభలో డిప్యూటీ స్పీకర్ పదవి 2019 నుంచి ఖాళీగా ఉండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ, సభలో ప్రతిపక్షాల గొంతుకకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. 

బీజేపీ పక్షనేత జేపీ నడ్డా మాట్లాడుతూ.. హరివంశ్ ప్రజా జీవితంలో ప్రజాస్వామ్య విలువలకు, చిత్తశుద్ధికి కట్టుబడి ఉన్నారని ప్రశంసించారు. కాగా, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ ఎంపీలు హరివంశ్ ఎన్నిక ప్రక్రియ జరుగుతున్న సమయంలో సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం హరివంశ్ మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచిన సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. 

సభ గౌరవాన్ని కాపాడుతానని, సభ్యుల హక్కులను రక్షిస్తూ సభా కార్యకలాపాలు సజావుగా సాగేలా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. జేడీయూ పార్టీకి చెందిన హరివంశ్.. పాత్రికేయ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. గతంలో కూడా ఆయన రెండు పర్యాయాలు డిప్యూటీ చైర్మన్‌‌‌‌గా సమర్థవంతంగా పనిచేశారు.