Ashok khemka : 30 ఏళ్ల సర్వీసులో 56వ సారి ఐఏఎస్ ఆఫీసర్ బదిలీ

Ashok khemka : 30 ఏళ్ల సర్వీసులో 56వ సారి ఐఏఎస్ ఆఫీసర్ బదిలీ

చండీగఢ్‌ : నీతి, నిజాయితీగా పని చేసే ఆఫీసర్లను ఒక చోట నుంచి మరో చోటకు బదిలీ చేస్తుండడం మనం తరచూ చూస్తుంటాం. వింటుంటాం. ఇక్కడ కూడా సరిగ్గా ఇదే జరిగింది. ఒక ఐఏఎస్ అధికారి 30 ఏళ్ల సర్వీసులో ఏకంగా 56సార్లు బదిలీ అయ్యారు. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ..ఇది నిజం. 

హర్యానాకు చెందిన అశోక్‌ ఖేమ్కా.. ఎక్కువ సార్లు బదిలీ అయ్యే ఐఏఎస్‌ అధికారిగా పేరున్న ఈయన మరోసారి వార్తల్లోకెక్కారు. ప్రస్తుతం హర్యానా సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖకు అదనపు ప్రధాన కార్యదర్శిగా ఉన్న అశోక్‌ ఖేమ్కాను అదే హోదాతో ప్రభుత్వ ప్రాచీన పత్ర భాండాగార (ఆర్కైవ్స్‌) శాఖకు బదిలీ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే.. బదిలీకి కారణం ఏమిటో ప్రభుత్వం వెల్లడించలేదు. ఖేమ్కాతోపాటు సోమవారం మరో నలుగురు హర్యానా సివిల్‌ సర్వీస్‌ అధికారులను కూడా బదిలీ చేశారు.

30 ఏళ్ల కెరీర్‌లో అశోక్‌ ఖేమ్కాకు ఇది 56వ బదిలీ కావడం గమనార్హం. ఉత్తర్వుల్లో పేర్కొనకపోయినప్పటికీ కొన్ని రోజుల క్రితం ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌)కి రాసిన లేఖ దీనికి కారణమని తెలుస్తోంది.

 ప్రస్తుతం తాను నిర్వహిస్తున్న శాఖను ఉన్నత విద్యా శాఖలో విలీనం చేయడంతో పని లేకుండా పోయిందని అశోక్‌ ఖేమ్కా ఆ లేఖలో పేర్కొన్నారు. తన స్థాయి అధికారికి వారానికి కనీసం 40 గంటల పని ఉండాలని సీఎస్‌కు సూచించారు. తన కెరీర్‌లో ఎక్కువ సార్లు అప్రాధాన్య పోస్టుల్లోనే కొనసాగిన ఖేమ్కా ఆర్కైవ్స్‌ శాఖలో పని చేయడం ఇది నాలుగోసారి.