సౌత్ ఇండియా నుంచి బీజేపీ తుడిచిపెట్టుకుపోయింది : జైరాం రమేశ్

సౌత్ ఇండియా నుంచి బీజేపీ తుడిచిపెట్టుకుపోయింది : జైరాం రమేశ్
  • మోదీకి ప్రజాజీవితంలో కొన‌‌సాగే అర్హత లేదు: జైరాం రమేశ్

రాంచీ: సౌత్ ఇండియా నుంచి బీజేపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని..మిగిలిన చోట్ల కూడా సగానికి తగ్గిపోయిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ అన్నారు. ఈ విషయాన్ని ఇప్పటివరకు జరిగిన పోలింగ్ సరళి స్పష్టంగా సూచిస్తున్నదని తెలిపారు. మోదీ ఇక ఔట్‌‌గోయింగ్ ప్రధాని అని పేర్కొన్నారు. బుధవారం జైరాం రమేశ్ జార్ఖండ్ రాజధాని రాంచీలోని కాంగ్రెస్ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. 

"ఓటర్లను ప్రధాని మత ప్రాతిపదికన పోలరైజ్ చేశారు. మళ్లీ ఇప్పుడు తాను హిందూ-, ముస్లిం పేరిట రాజకీయాలు చేయట్లేదని అబద్ధాలు చెబుతున్నారు. బీజేపీ ప్రచారం ఇప్పటికీ హిందూ-, ముస్లిం చుట్టే తిరుగుతున్నది. జూన్ 4 తర్వాత ఈ అబద్ధాల మహమ్మారి నుంచి దేశం బయటపడనుంది. నరేంద్ర మోదీ ఒక అవుట్‌‌గోయింగ్ ప్రధానిగా..అమిత్ షా అవుట్‌‌గోయింగ్ హోం మంత్రిగా మిగిలిపోనున్నారు. 

బీజేపీ ప్రభుత్వం ఈడీ, సీబీఐ, ఐటీ శాఖలను దుర్వినియోగం చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈ ఏజెన్సీలకు ఇచ్చిన అధికారాలను పరిశీలించనుంది. ప్రజాస్వామ్యాన్ని, దేశ రాజ్యాంగాన్ని కాపాడేందుకే ఇండియా  కూటమి ఏర్పడింది. దానికి అనుగుణంగానే పోరాడుతున్నది" అని వివరించారు. రాహుల్ గాంధీకి అదానీ, -అంబానీల నుంచి టెంపోల ద్వారా డబ్బు వస్తే ఈడీ, సీబీఐలతో బీజేపీ ఎందుకు దర్యాప్తు చేయించడం లేదని  జైరాం రమేశ్ నిలదీశారు. 

బీజేపీకి మత రాజకీయాలే తప్ప ఎజెండా లేదు

ప్రధాని మోదీకి హిందూ, ముస్లిం పేరిట మత రాజకీయాలు చేయడం తప్ప వేరే ఎజెండా ఏమీ లేదని జైరాం రమేశ్ ఆరోపించారు. బీజేపీ నినాదాలైన మోదీకి గ్యారంటీ నేలకొరిగిందని.. 400 పార్ స్లోగన్ నిశబ్దంగా సమాధి అయిపోయిందని ఎద్దేవా చేశారు. మోదీ అబద్ధాలకోరు అని దేశానికి బాగా తెలుసన్నారు. ప్రధాని కేవ‌‌లం హిందూ, ముస్లిం రాజ‌‌కీయాలు చేయ‌‌ద‌‌ల‌‌చుకుంటే ఆయ‌‌న ప్రజా జీవితంలో కొన‌‌సాగేందుకు ప‌‌నికిరార‌‌ని జైరాం రమేశ్ పేర్కొన్నారు.