హీరో ప్రభాస్​కు హైకోర్టులో చుక్కెదురు

హీరో ప్రభాస్​కు హైకోర్టులో చుక్కెదురు
  • ఫామ్​హౌస్​ను కూల్చవద్దని ప్రభుత్వానికి ఉత్తర్వులు
  • మునుపటి ఉత్తర్వులను కొనసాగించాలని ఆదేశం

హైదరాబాద్: హీరో ప్రభాస్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. హై-టెక్ సిటీకి దగ్గరలోని రాయదుర్గంలో రెండు వేల చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న ఆయన ఫామ్‌హౌస్​ను కూల్చవద్దని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. అదే సమయంలో ప్రభాస్ వేసిన పిటిషన్​ను కూడా తోసిపుచ్చింది. ఫాంహౌస్ లోని నిర్మాణాల విషయంలో యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. ఈ స్థలానికి సంబంధించిన వివాదంలో కిందటేడాది ఇచ్చిన ఉత్తర్వులను గుర్తుచేసింది. ఆ భూమిని ప్రభాస్ కు అప్పగించాల్సిన అవసరం లేదని, ప్రభుత్వ ఆధీనంలోనే ఉంచాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను చీఫ్ జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ పీ నవీన్ రావులతో కూడిన ధర్మాసనం ఆదేశించింది.

తాను చట్టబద్ధంగా కొన్న ఆస్తిని స్వాధీనం చేసుకోవడంలో రాష్ట్రం జోక్యం చేసుకుంటున్న దారుణమంటూ ప్రభాస్ తరఫున లాయర్ వాదనలు వినిపించారు. ఈ భూమి 1958 CS7 కు సంబంధించిన లిటిగేషన్ లో భాగమని, దానిని క్రమబద్దీకరించడం సాధ్యం కాదని ప్రభుత్వం వాదించింది. గతంలో కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు అమల్లో ఉండగా ప్రభాస్.. కూకట్ పల్లి సివిల్ కోర్టు నుంచి ఇంజక్షన్ ఉత్తర్వులు తెచ్చుకుని ఆస్థిని స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నించినట్లు ప్రభుత్వం తరఫున లాయర్ కోర్టుకు వివరించారు. హైకోర్టు ఇచ్చిన మునుపటి తీర్పుకు వ్యతిరేకంగా ఆయన వ్యవహరిస్తున్నాయరన్న అభియోగాలు మోపుతూ ప్రభుత్వం వేసిన పిటిషన్ మేరకు .. మునుపటి ఉత్తర్వులను కొనసాగించాలని బెంచ్ స్పష్టం చేసింది.