HCA అవినీతిమయం : అంబటి రాయుడు  సంచలన ఆరోపణ

HCA అవినీతిమయం : అంబటి రాయుడు  సంచలన ఆరోపణ

టీమ్‌‌ సెలెక్షన్స్‌‌లో అవినీతి
డబ్బు, పొలిటికల్‌‌ పవర్‌‌ ఉన్నవారికే చోటు
హెచ్‌‌సీఏ ఎలక్షన్స్‌‌లో  ‘రాజకీయ సాయం’ చేసిన వారి మాటే చెల్లుబాటు
అంబటి రాయుడు  సంచలన ఆరోపణ
జోక్యం చేసుకోవాలని మంత్రి కేటీఆర్‌‌కు ట్వీట్‌‌

హెచ్‌ సీఏ అవినీతిలో కూరుకుపోయిందని, డబ్బు, పవర్‌, పొలిటీషియన్స్‌ అండ ఉన్న వారినే టీమ్‌ లకు సెలెక్ట్‌ చేస్తున్నారని స్టార్‌ క్రికెటర్‌ అంబటి రాయుడు సంచలన విమర్శలు చేశాడు. ఈ విషయం ప్రెసిడెంట్‌ అజర్‌ దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఐటీ మినిస్టర్‌ కేటీఆర్‌ ను కోరాడు. ‘హలో సార్‌. హెచ్‌ సీఏలో తీవ్రమైన అవినీతిపై దృష్టి సారించండి. డబ్బున్నవాళ్లు, ఏసీబీ కేసులు నమోదైన వాళ్లు సంఘాన్ని నడిపిస్తున్నారు. వారికే ఇక్కడ రెడ్‌ కార్పెట్‌ పరుస్తున్నారు. అలాంటప్పుడు హైదాబాద్‌ క్రికెట్‌ ఎలా ముందుకెళ్తుంది’ అని రాయుడు ట్వీట్‌ చేశాడు.

హెచ్సీఏలో పొలిటికల్ సెలక్షన్స్

కొంతమంది ప్లేయర్లకు జట్టులో ఉండే అర్హత లేదు. కానీ, ఎలక్షన్స్‌‌లో ఇచ్చిన హామీ కారణంగా వాళ్లను ఎంపిక చేశారు. తుది జట్టు ఎంపికలో కొంతమంది విషయంలో నా చేతులు కట్టేస్తున్నారు. అన్ని లెవెల్స్‌‌లో క్లబ్‌‌ సెక్రెటరీలు చెప్పిన వారినే సెలెక్ట్‌‌ చేస్తున్నారు. డబ్బున్నోళ్లు, ఇన్‌‌ఫ్లుయెన్స్‌‌ చేసేవాళ్లు, పొలిటీషియన్స్‌‌ పిల్లలకే హైదరాబాద్‌‌ టీమ్స్‌‌లో ప్రిఫరెన్స్‌‌ ఉందన్నది సత్యం. దీనికి మనం అడ్డుకట్ట వేయాలి. దీనిపై ఎవరో ఒకరు మాట్లాడాలి కాబట్టి నేను ముందుకొచ్చా  – అంబటి రాయుడు

హైదరాబాద్‌‌, వెలుగు వివాదాలకు కేరాఫ్‌‌ అడ్రస్‌‌గా నిలిచే హైదరాబాద్‌‌ క్రికెట్‌‌ సంఘం (హెచ్‌‌సీఏ)లో మళ్లీ ముసలం మొదలైంది. రెండు నెలల కిందటే ప్రెసిడెంట్‌‌గా ఎన్నికైన అజరుద్దీన్‌‌ పాలనను గాలికి వదిలేయడంతో హైదరాబాద్‌‌ క్రికెట్‌‌ సంక్షోభంలో చిక్కుకుంది. రాజకీయ నేతల సాయం ఆర్జించి ఎలక్షన్స్‌‌లో గెలిచిన అజరుద్దీన్​ అండ్‌‌ కో.. దానికి ప్రతిఫలంగా హైదరాబాద్‌‌ జట్లలో సదరు నేతలు చెప్పిన వారిని ఎంపిక చేసే పనిలో నిమగ్నమయ్యారట. దాంతో, తన కెప్టెన్సీలోని సీనియర్‌‌ టీమ్‌‌ సహా అన్ని జట్లు తీవ్రంగా నష్టపోతున్నాయని స్టార్‌‌ క్రికెటర్‌‌ అంబటి రాయుడు ఆరోపించాడు. హెచ్‌‌సీఏ అవినీతిలో కూరుకుపోయిందని, డబ్బు, పవర్‌‌, పొలిటీషియన్స్‌‌ అండ ఉన్న వారినే సెలెక్ట్‌‌ చేస్తున్నారని విమర్శించడం సంచలనం సృష్టించింది. మ్యాచ్‌‌లో ఆడే ఫైనల్‌‌ ఎలెవెన్‌‌ టీమ్‌‌ ఎంపికలో కూడా కెప్టెన్‌‌గా తన మాట చెల్లుబాటు కావడం లేదని అంబటి ఆవేదన వ్యక్తం చేశాడు. హెచ్‌‌సీఏ మొత్తం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించాడు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఐటీ మినిస్టర్‌‌ కె.టి. రామారావును కోరాడు. ‘హలో సార్‌‌. హెచ్‌‌సీఏలోని తీవ్రమైన అవినీతిపై దృష్టి సారించండి. డబ్బున్నవాళ్లు, ఏసీబీ కేసులు నమోదైన వాళ్లు సంఘాన్ని నడిపిస్తున్నారు. వారికే ఇక్కడ రెడ్‌‌ కార్పెట్‌‌ పరుస్తున్నారు. అలాంటప్పుడు హైదాబాద్‌‌ క్రికెట్‌‌ ఎలా ముందుకెళ్తుంది’ అని రాయుడు ట్వీట్‌‌ చేశాడు.

రంజీలకే దూరమా.. హైదరాబాద్​కా..!

హెచ్‌‌సీఏలో అవినీతి కారణంగానే వచ్చే రంజీ సీజన్‌‌కు తాను దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు రాయుడు తెలిపాడు. టీమ్‌‌ ఎంపికల్లో అవినీతి గురించి అజర్‌‌కు చెప్పినప్పటికీ ఎలాంటి మార్పు కనిపించలేదన్నాడు. ‘కొంతమంది ప్లేయర్లకు జట్టులో ఉండే అర్హత లేదు. కానీ, ఎలక్షన్స్‌‌లో ఇచ్చిన హామీ కారణంగా వాళ్లను ఎంపిక చేశారు. తుది జట్టు ఎంపికలో కొంతమంది విషయంలో నా చేతులు కట్టేస్తున్నారు. సయ్యద్‌‌ ముస్తాక్‌‌ అలీ టీ20లో వారిని టచ్‌‌ చేయలేకపోయాం. అన్ని లెవెల్స్‌‌లో క్లబ్‌‌ సెక్రెటరీలు చెప్పిన వారినే సెలెక్ట్‌‌ చేస్తున్నారు. డబ్బున్నొళ్లు, ఇన్‌‌ఫ్లుయెన్స్‌‌ చేసేవాళ్లు, పొలిటీషియన్స్‌‌ పిల్లలకే హైదరాబాద్‌‌ టీమ్స్‌‌లో ప్రిఫరెన్స్‌‌ ఉందన్నది సత్యం. దీనికి మనం అడ్డుకట్ట వేయాలి. ఈ విషయంలో ఎవరో ఒకరు మాట్లాడాలి కాబట్టి నేను ముందుకొచ్చా’అని రాయుడు ఓ ఇంగ్లిష్‌‌ పత్రికకు ఇచ్చిన ఇంటర్య్వూలో చెప్పాడు.

హైదరాబాద్‌‌ సీనియర్‌‌ కోచ్‌‌గా కొనసాగే అర్హత అర్జున్‌‌ యాదవ్‌‌కు లేదని అంబటి విమర్శించాడు. అతనిపై కాన్‌‌ఫ్లిక్ట్‌‌ కేసు కూడా ఉందన్నాడు. కానీ, తండ్రి శివలాల్‌‌ యాదవ్‌‌ అండవల్లే అర్జున్‌‌ కోచ్‌‌ అయ్యాడని, ఇది కూడా హెచ్‌‌సీఏ ఎలక్షన్స్‌‌ సందర్భంగా కుదుర్చుకున్న ఒప్పందాల్లో ఒకటని అభిప్రాయపడ్డాడు. ఇవన్నీ తనతో పాటు జట్టు కాన్ఫిడెన్స్‌‌ను దెబ్బతీస్తున్నాయని చెప్పాడు. అందుకే రంజీ ట్రోఫీలో ఆడాలని ముందుగా భావించినా.. ఈ పరిణామాల నేపథ్యంలో కొద్ది రోజులు టీమ్‌‌కు దూరంగా ఉండాలని డిసైడయ్యానని చెప్పాడు. వచ్చే ఏడాది ఆరంభంలో విదేశాల్లో లిమిడెడ్‌‌ ఓవర్ల క్రికెట్‌‌ ఆడాలని భావిస్తున్నానని తెలిపాడు.అదే సమయంలో హైదరాబాద్‌‌ క్రికెట్‌‌కు సేవ చేసేందుకు తాను ఎప్పుడైనా సిద్ధమే అని చెప్పాడు. అయితే, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే రాయుడు హైదరాబాద్​కు దూరమయ్యే అవకాశం ఉందని హెచ్​సీఏ వర్గాలు చెబుతున్నాయి.

ప్రెసిడెంట్‌‌ అజర్‌‌ ఫ్లాప్‌‌ షో!

హైదరాబాద్‌‌ క్రికెట్‌‌ను ముందుకెళ్లడమే తమలక్ష్యమంటూ ఎలక్షన్స్‌‌లో గెలిచిన అజర్‌‌ పాలనలో వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. కొత్త పాలకవర్గం ఏర్పాటైన రోజుల వ్యవధిలోనే అంతర్గత విబేధాలు బయటపడ్డాయి. సంఘంలో రెండు గ్రూపులు తయారైనట్టు తెలుస్తోంది. ప్రెసిడెంట్‌‌ అజర్‌‌కు సెక్రెటరీ విజయానంద్‌‌కు ఏమాత్రం పొసగడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఆలిండియా కూచ్‌‌ బెహార్‌‌ అండర్‌‌–19 టోర్నీకి కొద్దిరోజుల కిందట అజర్‌‌, విజయానంద్‌‌ చెరో టీమ్‌‌ను ఎంపిక చేయడం, అంతకుముందు బీసీసీఐ ఏజీఎమ్‌‌కు హెచ్‌‌సీఏ ప్రతినిధిగా శివలాల్‌‌ యాదవ్‌‌ను కాదని అజరే వెళ్లడంతోనే సంఘం ఎపెక్స్‌‌ కౌన్సిల్‌‌ రెండు వర్గాలుగా చీలిందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

ఇక, హెచ్‌‌సీఏ ఎలక్షన్స్‌‌లో గెలిచేందుకు అజర్‌‌, అతని ప్యానెల్‌‌.. పలువురు రాజకీయ నాయకుల సాయం తీసుకుంది. అయితే, అప్పుడు సాయం చేసిన వారు.. ప్రతిగా ఇప్పుడు తాము చెప్పిన వారినే వివిధ లెవెల్స్‌‌ జట్లకు ఎంపిక చేయాలని హెచ్‌‌సీఏ పెద్దలపై ఒత్తిడి తెస్తున్నారని తెలుస్తోంది. రాయుడు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించాడు. ఏదేమైనా హెచ్‌‌సీఏ పెద్దల రాజకీయం.. క్రికెట్​ను దెబ్బతీయడం ఆందోళన కలిగిస్తోంది. ఏ విషయంలోనూ పెద్దగా మాట్లాడని అంబటి ఇంత తీవ్రమైన ఆరోపణలు, ఆందోళన వ్యక్తం చేయడం చూస్తే హెచ్‌‌సీఏలో అవినీతి ఊహించిన దానికంటే ఎక్కువే ఉందనిపిస్తోంది.

రాయుడు ఓ ఫ్రస్ట్రేటెడ్ క్రికెటర్: అజర్ ఎద్దేవా

అంబటి చేసిన ఆరోపణలపై హెచ్‌‌సీఏ ప్రెసిడెంట్​ అజర్​ స్పందించాడు. రాయుడు ఓ ఫ్రస్ట్రేటెడ్​ క్రికెటర్​ అని ఎద్దేవా చేశాడు. అంబటి ఆరోపణలు అతని వ్యక్తిగతమైనవని సెక్రెటరీ విజయానంద్​ అన్నాడు.  ‘హెచ్‌‌సీఏలో గ్రూపులు  లేవు, అజర్‌‌కు నాకు మధ్య  ఎలాంటి విబేధాలు లేవు. డేనైట్‌‌ టెస్టు కోసం మేం కోల్‌‌కతా వచ్చాం. ఆదివారం హైదరాబాద్‌‌కు తిరిగొచ్చిన తర్వాత రాయుడు చేసిన ఆరోపణలు, రంజీ టీమ్‌‌ గురించి అపెక్స్‌‌ కౌన్సిల్‌‌లో చర్చిస్తామ’ని  చెప్పాడు. అయితే, రంజీల్లో ఆడబోనని రాయుడు రెండు రోజుల కిందటే  సెలెక్షన్ ప్యానెల్​ చైర్మన్​ ఆర్​.ఎ. స్వరూప్​కు లెటర్ ఇవ్వగా, ఆ విషయం తనకు తెలియదని విజయానంద్​ చెప్పడం గమనార్హం.

మరిన్ని వార్తల కోసం