యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘డ్రాగన్’ (Dragon). ఈ రోజు ఎన్టీఆర్ బర్త్‌డే ( మే 20 న) సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్, ఒక పవర్‌ఫుల్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. మోకాళ్లపై కూర్చొని, చేతిలో గొడ్డలి పట్టుకుని, చుట్టూ మంటల మధ్య ఎన్టీఆర్ ఇచ్చిన ఇంటెన్సివ్ లుక్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది.
ఈ చిత్రంలో ఎన్టీఆర్ ‘ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ’కి చెందిన ‘లూగర్’ అనే పవర్‌ఫుల్ హంతకుడు పాత్రలో కనిపించబోతున్నారు. అయితే, ఈ సినిమా కోసం ఎన్టీఆర్ బాగా బరువు తగ్గడంపై మొదట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. దీనిపై లేటెస్ట్ గా ప్రశాంత్ నీల్ స్పందిస్తూ షాకింగ్ విషయాలు పంచుకున్నారు.
ఎన్టీఆర్ ఒక నిజమైన పిచ్చోడు!
నేను ఎన్టీఆర్‌ను కేవలం పాత్ర కోసం కొంచెం బరువు తగ్గమని మాత్రమే చెప్పాను అని దర్శకుడు ప్రశాంత్ చెప్పారు. కానీ, తారక్ ఒకసారి ఫిక్స్ అయితే ఆపడం ఎవరి తరం కాదు ... ఏకంగా 15 కిలోలు తగ్గి ‘బెర్సెక్ మోడ్’లోకి వెళ్ళిపోయారు. దాంతో ఆయన చాలా నీరసంగా, సన్నగా కనిపించారు. ఇది చూసి తారక్ భార్య లక్ష్మీ ప్రణతి, ఆయన తల్లి, స్నేహితులు, నా టీమ్ అంతా నాపై తీవ్రంగా మండిపడ్డారు. జనాలు కూడా ఎన్టీఆర్‌కు ఏదో జబ్బు చేసింది అంటూ నాపైనే నిందలు వేశారు. నేను ఎన్నోసార్లు వద్దని వారించినా వినలేదు. 'నువ్వు రాసుకున్న కథ కోసం, నీ విజన్ కోసం ఇది నేను చేయాల్సిందే' అని మొండిగా సాధించి చూపించారు. నా కెరీర్‌లో ఇంతటి మొండిఘటాన్ని, ఒక నిజమైన పిచ్చోడిని ఎక్కడా చూడలేదు అని నీల్ కొనియాడారు.
►ALSO READ | David Reddy: బ్రిటిష్ వాళ్లను తగలబెట్టేసిన ‘రాక్షస్ రెడ్డి’.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న మనోజ్ ‘డేవిడ్ రెడ్డి’ టీజర్!
చాలా పెద్ద రిస్క్ పాత్ర
ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్ర గురించి చెబుతూ.. నేను ఎన్టీఆర్‌ను ఐదేళ్ల క్రితం కలిసి ఈ కథ చెప్పాను. నా కెరీర్‌లోనే ఇది అత్యంత డార్క్ క్యారెక్టర్. ఒక స్టార్ హీరో ఇలాంటి నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేయడం చాలా పెద్ద రిస్క్. కానీ, పాత్ర చేసే క్రూరమైన పనుల వెనుక బలమైన డ్రామా, కారణం ఉందా? అని మాత్రమే తారక్ అడిగారు. ఆ జస్టిఫికేషన్ కోసమే మాకు మూడేళ్లు పట్టింది. సినిమా చూశాక మీకే అర్థమవుతుంది ఆయన ఎంతటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారో అని ప్రశాంత్ నీల్ క్లారిటీ ఇచ్చారు.
మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ పాన్-ఇండియా చిత్రంలో అనిల్ కపూర్, రుక్మిణీ వసంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం జూన్ 11, 2027న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విధ్వంసం సృష్టించడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్ రికార్డు స్థాయిలో దూసుకుపోతుంది.
