కొత్తిమీర తింటే టాబ్లెట్స్ అవసరం లేదు

కొత్తిమీర తింటే టాబ్లెట్స్ అవసరం లేదు

ఏ చిన్న  రోగం వచ్చినా అందరూ కామన్‌‌గా చేసే పని ఓ యాంటి బయాటిక్ టాబ్లెట్ వేసుకోవడం. రోగానికి సెపరేట్‌‌గా మందు ఉన్నా ఆ మందులతో పాటు యాంటీ బయాటిక్ టాబ్లెట్ కూడా కలిపి వాడడం అందరికీ అలవాటు. యాంటీ బయాటిక్స్ మంచివే అయినా మరీ ఎక్కువగా వాడితే శరీరమంతా వాటితోనే నిండిపోతుంది. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావడం ఖాయం. అందుకే నేచురల్‌‌గా దొరికే యాంటీ బయాటిక్స్ వాడితే సమస్యొచ్చిన ప్రతీసారి టాబ్లెట్ల అవసరం ఉండదు.

ఆరోగ్యానికి సంబంధించి ఒక ఫేమస్ కొటేషన్ ఉంది. ‘మీ ఆహారమే మీ ఔషధం, మీ ఔషధమే మీ ఆహారం’ అని.  అంటే తినే తిండే ఆరోగ్యానికి మందులా పనిచేయాలి తప్ప ఆర్టిఫిషియల్ మందుల మీద ఎక్కువ ఆధారపడకూడదు.

శరీరంలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్‌‌ను తగ్గించడానికి యాంటీ బయాటిక్స్‌‌ను వాడతారు. అయితే మరీ ఎక్కువగా యాంటీ బయాటిక్స్ తీసుకోవడం వల్ల శరీరంలో వ్యాధినిరోధక శక్తి తగ్గిపోతుంది. దాంతో సైడ్‌‌ఎఫెక్ట్స్ వస్తాయి. అలాగే శరీరం యాంటీ బయాటిక్స్‌‌కు అలవాటు పడిపోతుంది. యాంటీ బయాటిక్స్‌‌ వాడినన్ని రోజులూ చాలా ఎఫెక్టివ్‌‌గా బ్యాక్టీరియాను ఎదుర్కొని, వాడడం ఆపగానే పనితీరు మందగిస్తుంది. అందుకే ఇమ్యూనిటీ తగ్గకుండా, యాంటీ బయాటిక్‌‌గా పనిచేసే కొన్ని హోం రెమిడీస్ ఉన్నాయి. అవేంటంటే..

కొత్తిమీర

కొత్తిమీరలో చాలా విటమిన్స్, ఫైటో న్యూట్రియెంట్స్ ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తాయి. దీంతో పాటుగా వీటిలోని యాంటీ బయాటిక్ లక్షణాలు వైరస్‌‌ను ఎటాక్ చేస్తాయి. అందుకే అనారోగ్యంగా ఉన్నప్పడు కొత్తిమీర ఎక్కువగా తీసుకోవాలి. కొత్తిమీరని జ్యూస్‌‌లా తాగొచ్చు లేదా కొత్తిమీర, ధనియాలతో టీ చేసుకుని తాగొచ్చు.

వెల్లుల్లి

వెల్లుల్లితో ఉండే లాభాలు అన్నీ ఇన్నీ కావు.  ఇందులో యాంటీఫంగల్‌‌, యాంటీవైరల్‌‌ గుణాలు ఎక్కువగా ఉంటాయి. వెల్లుల్లిలో ఉండే ఖనిజాలు, విటమిన్లు, పోషకాలు బ్యాక్టీరియాను తరిమికొట్టి అనారోగ్యాన్ని దూరం చేస్తాయి. అందుకే వెల్లుల్లిని రోజూ తినే వంటకాల్లో భాగం చేసుకోవాలి. లేదా ఉదయాన్నే పరగడుపున రెండు మూడు వెల్లుల్లి రెబ్బల్ని నమలడం మంచిది.

పసుపు

పసుపు నేచురల్ యాంటీ బయాటిక్ అని అందరికీ తెలిసిందే.. అందుకే గాయాలు అయినప్పుడు పసుపు రాస్తుంటారు.
పసుపును ఆయుర్వేదిక్‌‌ మందుల తయారీలోనూ వాడతారు.  ఇందులో ఉండే యాంటీ బయాటిక్‌‌ లక్షణాలు శరీరాన్ని బ్యాక్టీరియా నుంచి కాపాడడంలో కీ రోల్ పోషిస్తాయి. అలాగే పసుపులోని ‘కుర్కుమిన్’ అనే పదార్థం చాలా రకాల అనారోగ్యాల నుంచి రక్షిస్తుంది. అందుకే పసుపును వంటల్లో తప్పనిసరిగా వాడాలి. దీంతో పాటు రోజూ పసుపు, తేనె మిశ్రమాన్ని తీసుకోవడం కూడా మంచిదే.

అల్లం

బ్యాక్టీరియాను ఎఫెక్టివ్‌‌గా ఎదుర్కోవడంలో అల్లం ముందుంటుంది. అల్లంలో ఉండే యాంటీబయాటిక్‌‌ గుణాలు బ్యాక్టీరియా వల్ల కలిగే పలు రకాల ఆరోగ్య సమస్యల నుంచి మనల్ని కాపాడతాయి. అలాగే శ్వాసకోశ సంబంధిత సమస్యలు, చిగుళ్ల ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి కూడా ఉపయోగపడతాయి. అందుకే  రోజువారీ ఆహారంలో అల్లాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి. దాంతో పాటు రోజూ అల్లం టీ తాగడం కూడా మంచిదే.