IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ అత్యంత ఉత్సాహంగా ప్రారంభమైంది. లీగ్‌లో పాల్గొంటున్న 10 జట్లూ తమ తొలి మ్యాచ్‌లను పూర్తి చేసుకున్నాయి. వరుసగా ఐదు రోజుల పాటు జరిగిన ఈ పోరాటాల్లో ఐదు జట్లు విజయభేరి మోగించగా, మిగిలిన ఐదు జట్లు ఓటమితో టోర్నీని స్టార్ట్ చేశాయి. కాగా ఈ సీజన్ ప్రారంభంలో బ్యాటర్ల ఆధిపత్యం ప్రదర్శించినా, ఇప్పుడు బౌలర్లు కూడా క్రమంగా తమ ప్రభావాన్ని చూపుతున్నారు. రాబోయే మ్యాచ్‌లలో బ్యాటింగ్, బౌలింగ్ మధ్య సమతుల్యతతో లీగ్ మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది.
పాయింట్ల పట్టికలో అగ్రస్థానం ఎవరిదంటే?
ప్రస్తుత పాయింట్ల పట్టికను గమనిస్తే, భారీ నెట్ రన్ రేట్ (+4.171) కలిగిన రాజస్థాన్ రాయల్స్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. తర్వాతి స్థానాల్లో వరుసగా:
* రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (+2.907)
* ఢిల్లీ క్యాపిటల్స్ (+1.397)
*ముంబై ఇండియన్స్ (0.687)
* పంజాబ్ కింగ్స్ (0.509) తమ ఖాతాలను తెరిచి టాప్-5 లో నిలిచాయి.
రికార్డుల జోరు:
తొలి ఐదు మ్యాచ్‌ల్లోనే బ్యాటర్లు పరుగుల వర్షం కురిపించారు. ఈ రౌండ్‌లో మొత్తం 10 హాఫ్ సెంచరీలూ నమోదు కావడం విశేషం. ముంబై ఇండియన్స్ 224 పరుగులు చేసి అగ్రస్థానంలో కొనసాగుతుంది. కేకేఆర్ నిర్దేశించిన 221 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి అందరినీ ఆశ్చర్యపరిచింది. చెన్నై సూపర్ కింగ్స్ కేవలం 127 పరుగులకే ఆలౌట్ అయ్యి తీవ్రంగా నిరాశపరిచింది.
బౌలర్లకు చుక్కలే:
* ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్‌హెచ్: సన్‌రైజర్స్ హైదరాబాద్ పెట్టిన 202 పరుగుల లక్ష్యాన్ని డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ కేవలం 15.4 ఓవర్లలోనే ఛేదించింది. విరాట్ కోహ్లీ, దేవదత్ పాడిక్కల్ అజేయ ఇన్నింగ్స్‌తో రాణించారు.
*ముంబై వర్సెస్ కేకేఆర్: రోహిత్ శర్మ విజృంభించడంతో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ (80) పోరాడినా ఫలితం దక్కలేదు.
* రాజస్థాన్ వర్సెస్ సీఎస్కే: గువాహటిలో రాజస్థాన్ బౌలర్లు సీఎస్కేను తక్కువ స్కోరుకే కట్టడి చేయగా, బ్యాటర్లు అదే పిచ్‌పై సునాయాసంగా పరుగులు రాబట్టడంతో విజయం సాధించింది.
పుంజుకుంటున్న బౌలర్లు:
ప్రతి మ్యాచ్‌లో బ్యాటర్లదే హవా అయితే మజా ఉండదని భావిస్తున్న తరుణంలో, గత రెండు మ్యాచ్‌ల్లో బౌలర్లు గట్టి పోటీ ఇచ్చారు.
* గుజరాత్ vs పంజాబ్: 163 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవడానికి గుజరాత్ టైటాన్స్ బౌలర్లు చివరి ఓవర్ వరకు శ్రమించారు. పంజాబ్ బ్యాటర్ కూపర్ కన్నోలీ పట్టుదలగా ఆడి జట్టును గెలిపించాడు.
* ఢిల్లీ vs లక్నో: లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లు ఢిల్లీ క్యాపిటల్స్ ని 26 పరుగులకే 4 వికెట్లు తీసి భయపెట్టారు. స్టబ్స్, ప్రిన్స్ యాదవ్ మధ్య మైదానంలో టెన్షన్ నెలకొంది. అయితే ఇంపాక్ట్ ప్లేయర్ సమీర్ రిజ్వీ (70)* అద్భుత ఆటతీరుతో ఢిల్లీని గెలిపించాడు.
తొలి రౌండ్ స్టార్ ప్లేయర్స్:
బ్యాటింగ్ విభాగంలో ర్యాన్ రికెల్టన్ 81 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత ఆటగాళ్లలో ఇషాన్ కిషన్ 80 పరుగులతో ముందున్నాడు. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మూడు వందలకుపైగా స్ట్రైక్ రేట్‌తో హాఫ్ సెంచరీ చేయడం విశేషం. రికెల్టన్ 8 సిక్సర్లతో, రోహిత్ శర్మ 6 సిక్సర్లతో జాబితాలో ముందుండగా.. సన్‌రైజర్స్ కెప్టెన్ ఇషాన్ కిషన్ 8 ఫోర్లతో ఎక్కువ బౌండరీలు సాధించిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు.
బౌలింగ్ విభాగంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ జాకబ్ డఫీ, ప్రసిద్ధ కృష్ణ, నటరాజన్, లుంగి ఎంగిడి, విజయకుమార్, శార్దూల్, రొమారియో షెఫర్డ్ తలా మూడు వికెట్లు తీసుకున్నారు. బెస్ట్ బౌలింగ్ ప్రదర్శన జాకబ్ డఫీ (3 వికెట్లు 22 పరుగులు). రాజస్థాన్ రాయల్స్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ రెండు వికెట్లు, మోసిన్ ఖాన్ ఒక వికెట్ తీసినా, వారి ఎకానమీ అద్భుతంగా ఉంది. నాలుగు ఓవర్లలో కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చి 4.75 ఎకానమీతో బౌలింగ్ చేశారు.
