- మన ఆరోగ్య వివరాలన్నీ అందులోనే
- వచ్చే నెల నుంచి మన రాష్ట్రంలో అమలు
- ప్రతి ఒక్కరికీ 16 అంకెల యూనిక్ ఐడీ
హైదరాబాద్, వెలుగు: దేశంలోని ప్రతి ఒక్కరికీ హెల్త్ రికార్డులను రూపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద హెల్త్ అకౌంట్లను ఓపెన్ చేయాలని కేంద్రం నిర్ణయించింది. దీన్ని ఏర్పాటు చేసేందుకు యాప్, వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. గత ఏడాది ప్రారంభించిన పైలట్ ప్రాజెక్ట్ విజయవంతం కావడంతో దేశవ్యాప్తంగా అమలు చేయబోతున్నట్టు ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల కిందటే ప్రకటించారు. ఈ క్రమంలో వచ్చే నెల నుంచి మన రాష్ర్టంలో ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తామని హెల్త్ ఆఫీసర్లు తెలిపారు.
ఇట్లుంటది
హెల్త్ అకౌంట్లలో మన ఆరోగ్యానికి సంబంధించిన రికార్డులన్నీ దాచుకోవచ్చు. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినట్టుగా, ముందుగా మన ఆధార్ కార్డు, ఫోన్ నంబర్‌తో వెబ్‌సైట్(https://healthid.ndhm.gov.in/)లో హెల్త్ అకౌంట్ తీసుకోవాల్సి ఉంటుంది. వివరాలు ఎంటర్ చేయగానే 16 అంకెలతో కూడిన అకౌంట్ నంబర్ కేటాయిస్తారు. ఆధార్ నంబర్ మాదిరిగానే ఈ నంబర్ ఎవరిది వాళ్లకే యూనిక్‌గా ఉంటుంది. ఇదే మన హెల్త్ అకౌంట్ నంబర్ లేదా హెల్త్ ఐడీగా ఉపయోగపడుతుంది. హాస్పిటల్‌కు వెళ్లినప్పుడు ఈ ఐడీ చెబితే సరిపోతుంది. ఒకవేళ ఐడీ లేకపోతే, మన వివరాలు తీసుకుని హాస్పిటల్ వాళ్లే ఐడీ క్రియేట్ చేసి ఇస్తారు. డాక్టర్ కన్సల్టేషన్ వివరాల దగ్గరి నుంచి, మనం చేయించుకున్న టెస్టులు, మనం వాడిన మెడిసిన్ సహా అన్ని వివరాలు అందులో హాస్పిటల్ వాళ్లే అప్‌లోడ్ చేస్తారు. దీంతో డాక్టర్ దగ్గరకు వెళ్లిన ప్రతిసారి పాత రికార్డులు పట్టుకుపోయే తిప్పలు ఉండవు.
ఇట్ల చేసిన్రు
‘నేషనల్ డిజిటల్ హెల్త్ రికార్డ్స్ (ఎన్‌డీహెచ్‌ఆర్)’ పేరిట ఈశాన్య రాష్ట్రాల్లో గతేడాది యాప్, వెబ్‌సైట్‌ను అమల్లోకి తీసుకొచ్చారు. ఎవరైనా పేషెంట్ వస్తే, తొలుత ఆధార్, ఫోన్ నంబర్లు, ఇతర వివరాలు తీసుకుని హెల్త్ ఐడీ క్రియేట్ చేయించేలా ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటళ్లతో ఒప్పందం చేసుకున్నారు. తక్కువ కాలంలోనే 11.68 లక్షల మందికి హెల్త్ ఐడీ క్రియేట్ చేశారు. ఆధార్ కార్డు తరహాలోనే అందరికీ హెల్త్ ఐడీ కార్డులు ఇచ్చారు. దీని వల్ల సదరు వ్యక్తికి వచ్చిన రోగానికి గల కారణాన్ని అంచనా వేయడం, ట్రీట్‌మెంట్ ఇవ్వడం డాక్టర్‌కు ఈజీ అవుతుంది. ఆ వ్యక్తికి ఇచ్చిన ట్రీట్‌మెంట్, మెడిసిన్ వివరాలన్నింటినీ మళ్లీ డాక్టర్ ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తారు.
ఇన్సూరెన్స్‌కూ మస్ట్
హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్‌కు కూడా ఎన్‌హెచ్‌ఆర్‌ను లింక్ చేయనున్నారు. ఇన్సూరెన్స్ చేయించుకున్న వ్యక్తి హాస్పిటల్‌లో చేరగానే, ఆ వ్యక్తికి సంబంధించిన వివరాలన్నీ ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్లిపోతాయి. పేషెంట్‌కు ఇచ్చే ట్రీట్‌మెంట్ పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు హాస్పిటల్ వాళ్లు, ఆ వ్యక్తి హెల్త్ అకౌంట్‌లో అప్‌డేట్ చేస్తుంటారు. ఇన్సూరెన్స్ కంపెనీ ఆ వివరాలను సరిచూసుకుని, ఆన్‌లైన్‌లోనే అమౌంట్ క్లెయిమ్ చేస్తుంది. దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఈ ఐడీతో మన సమాచారం చూసుకోవచ్చు. మన పర్మిషన్‌తో డాక్టర్లు, ఇన్సూరెన్స్ కంపెనీలు మన వివరాలను చూడొచ్చు. దీంతో జనాలకు ఏయే రోగాలొస్తున్నయో చూసి, అందుకు అనుగుణంగా ప్రభుత్వాలు పాలసీలు రూపొందించొచ్చు.
