ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులకు హెల్త్ స్కీమ్స్!: అమిత్ షా

ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులకు హెల్త్ స్కీమ్స్!: అమిత్ షా
  • కేంద్ర ప్రభుత్వ పథకాలను వాడుకోవాలి
  • ప్రైవేటు ఏజెన్సీలకు కేంద్ర హోం మంత్రి సూచన

న్యూఢిల్లీ: సెక్యూరిటీ గార్డులకు హెల్త్ ఇన్సూరెన్స్ వంటి పథకాలను అందజేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రైవేటు ఏజెన్సీలకు సూచించారు. తరచూ మెడికల్ చెకప్స్ కూడా చేయించాలన్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన వంటి పథకాలను ఉపయోగించుకోవాలన్నారు.

మంగళవారం ఢిల్లీలో ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీల లైసెన్సింగ్ పోర్టల్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీలు ఎన్సీసీ ట్రైనింగ్ పొందిన వారిని సెక్యూరిటీ గార్డులుగా తీసుకోవడం ద్వారా ప్రాథమిక శిక్షణ ఇవ్వాల్సిన అవసరం పెద్దగా ఉండదన్నారాయన.

దేశంలో మొత్తంగా అన్ని విభాగాల పోలీసులు కలిపి 30 లక్షల మంది మాత్రమే ఉన్నారని అమిత్ షా చెప్పారు. వారికి మూడింతలుగా.. 90 లక్షల మంది ప్రైవేటు సెక్యూరిటీ గార్డులు ఉన్నారని, శాంతిభద్రతలు, ప్రజల సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు.

రూ.22 చెల్లిస్తే.. 2 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్

సెక్యూరిటీ ఏజెన్సీలు కచ్చితంగా ప్రతి గార్డుకు జన్ ధన్ బ్యాంకు అకౌంట్ ద్వారానే జీతాలు చెల్లించాలని అమిత్ షా చెప్పారు. వారికి తరచూ మెడికల్ చెకప్ లు, హెల్త్ ఇన్సూరెన్స్ వంటి సంక్షేమ కార్యక్రమాలను తప్పక అందించాలని ఏజెన్సీలకు సూచించారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ద్వారా ఏడాదికి కేవలం 22 రూపాయలు చెల్లించి, రూ.2 లక్షల ఇన్సూరెన్స్ పొందొచ్చని అన్నారు. అలాగే అటల్ పెన్షన్ యోజన కిందకి కూడా ప్రతి ప్రైవేటు సెక్యూరిటీ గార్డు వచ్చేలా చూడాలన్నారు.