ఆరోగ్యంగా ఉండాలంటే కంటినిండా నిద్ర అవసరం

ఆరోగ్యంగా ఉండాలంటే కంటినిండా నిద్ర అవసరం

ఆరోగ్యంగా ఉండాలంటే హెల్దీ ఫుడ్, ఎక్సర్​సైజ్​ మాత్రమే సరిపోవు. కంటినిండా నిద్ర కూడా అవసరమే. అప్పుడే బ్రెయిన్​ యాక్టివ్​గా ఉంటుంది. శరీరంలోని అన్ని ఆర్గాన్స్​కి సిగ్నల్స్​ అందుతాయి. కానీ, కొందరికి నిద్రపోతుంటే ఊపిరి సరిగా ఆడదు. ఒక్కోసారి ప్రాణం పోయినంత పనవుతుంది. నిద్రలో వచ్చే ఈ ప్రాబ్లమ్​ని ‘స్లీప్​ ఆప్నియా’ అంటారు. ఇదొక సీరియస్​ స్లీప్​ డిజార్డర్​ఫేమస్​ సింగర్​ బప్పి లహిరి ఈమధ్య ఇదే ప్రాబ్లమ్​తో చనిపోయాడు. అందుకే  ‘స్లీప్​ ఆప్నియాని చిన్న సమస్య అనుకోవద్దు. ముందుగానే గుర్తించి ట్రీట్మెంట్​ తీసుకోవడం చాలా ముఖ్యం’ అంటున్నాడు పల్మొనాలజిస్ట్​ వివేక్​ తోష్నివాల్.

స్లీప్​ ఆప్నియాలో రెండు రకాలు...  అబ్​స్ట్రక్టివ్​ స్లీప్​, నాన్​–అబ్​స్ట్రక్టివ్​ స్లీప్​ ఆప్నియా.  నాన్​–అబ్​స్ట్రక్టివ్​ లో సెంట్రల్​ స్లీప్​ ఆప్నియా అని ఉంటుంది. ప్రపంచంలో ఎక్కువ మందికి ఉన్న సమస్య అబ్​స్ట్రక్టివ్​ స్లీప్​ ఆప్నియా. శ్వాస తీసుకునేటప్పుడు గొంతు దగ్గరి శ్వాస వాహికలు మూతపడతాయి. దాంతో  కొంచెం సేపు లేదంటే మొత్తానికే శ్వాస తీసుకోవడం ఆగిపోతుంది. దీన్ని ‘అబ్​స్ట్రక్టివ్​ స్లీప్​ ఆప్నియా’ అంటారు. ప్రపంచంలో 30% మంది  మగవాళ్లు, 5 –15% మంది ఆడవాళ్లు ఈ సమస్యతో బాధపడుతున్నారు. అయితే, వీళ్లలో చాలామందికి తమకు ఈ సమస్య ఉన్న విషయం తెలియదు. 

వీళ్లలోనే ఎక్కువ

యాభై ఏండ్లుదాటిన వాళ్లు, ఒబెసిటీ ఉన్నవాళ్లు (బాడీ మాస్​ ఇండెక్స్​ 25 ఉంటే రిస్క్​ ఎక్కువ. 30 పైన ఉంటే రిస్క్​ చాలా ఎక్కువ). గుండె సమస్యలు, మూత్రపిండాలు, ఊపిరితిత్తుల సమస్యలు, మానసిక సమస్యలు ఉన్నవాళ్లు  స్లీప్​ ఆప్నియా బారినపడే ఛాన్స్​ ఎక్కువ. 
రిస్క్​ ఫ్యాక్టర్స్​
 స్లీప్​ ఆప్నియాకు పెద్ద రిస్క్​ ఫ్యాక్టర్​​​.. సిగరెట్​. ఆల్కహాల్​ అలవాటు కూడా ఒక కారణం. అంతే కాదు మెడ చిన్నగా ఉండడం, మెడ దగ్గర ఫ్యాట్​ ఎక్కువ ఉండడం, ముఖం లోని కండరాలు సరైన పొజిషన్​లో లేకపోవడం వంటి ఫేషియల్​ ప్రాబ్లమ్స్​ వల్ల కూడా అబ్​స్ట్రక్టివ్​ స్లీప్​ ఆప్నియా వస్తుంది. 

ఈ లక్షణాలు ఉంటే...

పెద్దగా గురక పెడతారు.  పొద్దున లేచిన తర్వాత  మళ్లీ పడుకుంటారు. కూర్చున్నవాళ్లు అలాగే నిద్రలోకి జారుకుంటారు. దీన్ని ‘ఎక్సెసివ్​​ డే టైమ్​ స్లీపినెస్​’ అంటారు. కొందరేమో  శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉందని మధ్య రాత్రి లేచి కూర్చుంటారు. ఒక్కోసారి నిద్రలోనే వీళ్ల శ్వాస ఆగిపోతుంది కూడా. రాత్రి నిద్ర లేకపోవడం వల్ల పొద్దున లేవగానే తలనొప్పి వస్తుంది, ఊరికే చిరాకు పడతారు. ఏ పని మీద ఫోకస్ ఉండదు. మెమరీ తగ్గిపోతుంది కూడా. వీటన్నింటికీ కారణం... శ్వాస ఆగిపోయినప్పుడు ఊపిరితిత్తులకి, మెదడుకి ఆక్సిజన్ చాలినంత అందకపోవడమే. దాంతో  మెదడు చురుకుదనం తగ్గిపోతుంది, శరీర భాగాలకి సిగ్నల్స్​ పంపించే వ్యవస్థ సరిగా పనిచేయదు. 

డయాగ్నసిస్​

పాలీ సోమ్నోగ్రఫీ, స్లీప్​ స్టడీ చేసి స్లీప్​ ఆప్నియాని డయాగ్నసిస్​ చేస్తారు. ఒకవేళ బ్రాంకైటిస్, ఆస్తమా ఉంటే  మెడిసిన్​ ఇస్తారు. అప్పటికీ పేషెంట్లకి నిద్ర సమస్యలుంటే నిద్ర లక్షణాలను​ స్టడీ చేస్తారు.  పేషెంట్​ కండీషన్​ని బట్టి  హాస్పిటల్లోనే పాలీసోమ్నోగ్రఫీ చేయాలా? లేదా ఇంటి దగ్గర స్లీపింగ్​ టెస్ట్​ చేయాలా? అనేది ​ నిర్ణయిస్తారు. పేలుడు పదార్థాలు, రసాయనాలు తయారుచేసే కంపెనీల్లో వాళ్లకి హాస్పిటల్లోనే స్లీప్​ టెస్ట్ చేస్తారు.  

ఇవి కాంప్లికేషన్స్

స్లీప్​ ఆప్నియా ప్రాబ్లమ్​ ఉన్నవాళ్లు  డ్రైవింగ్​ చేస్తూనే సడన్​గా నిద్రపోతారు. దాంతో వెహికల్​ కంట్రోల్​ తప్పి రెప్పపాటులో యాక్సిడెంట్​ జరుగుతుంది. కెమికల్​ కంపెనీల్లో పనిచేసేవాళ్లలో మైనర్​  స్లీప్​ ఆప్నియా ఉన్నా  ఒక్కోసారి పెద్ద ప్రమాదం జరిగే ఛాన్స్​ ఉంది. అంతేకాదు ఈ సమస్య ఉన్నవాళ్లలో ఊపిరితిత్తుల సమస్యలు, డయాబెటిస్​, బీపీ పెరగడం, హార్ట్​ఎటాక్స్​, హార్ట్​బీట్ పెరగడం, స్ట్రోక్, పెరాలసిస్​, డిప్రెషన్​, బరువు పెరగడం వంటి కాంప్లికేషన్స్​ వచ్చే అవకాశం ఉంది. 

ఇలా చేస్తే బెటర్

స్మోకింగ్​, ఆల్కహాల్​ మానేయాలి. వేపుళ్లు, స్పైసీ ఫుడ్​ తినొద్దు. బరువు తగ్గడం కోసం ఎక్సర్​సైజ్, యోగా, ధ్యానం వంటివి చేయాలి.  ఒకేసారి ఎక్కువ తినడం కంటే రోజులో ఆరు సార్లు కొంచెం కొంచెం తినాలి. దాంతో మెటబాలిజం వేగంగా జరుగుతుంది. గుండె, ఊపిరితిత్తుల సమస్యలు ఉంటే వెంటనే డాక్టర్​ని కలిసి ట్రీట్మెంట్​ తీసుకోవాలి. 

పాజిటివ్​ ఎయిర్​వే ప్రెజర్​ థెరపీ (పిఎపి) ద్వారా స్లీప్​ ఆప్నియాని తగ్గిస్తారు​. ఇందులో సి–పాప్​, బై–పాప్​ అని రెండు రకాలు ఉంటాయి. పేషెంట్​ స్లీప్​ స్టడీ రిపోర్ట్​, పేషెంట్​ కండీషన్​ని బట్టి ఏ రకం పిఎపి చేయాలో డాక్టర్లు డిసైడ్​ చెప్తారు. అప్పటికి కూడా స్లీప్​ అప్నియా తగ్గకుంటే గొంతుకి సర్జరీ చేసి శ్వాస వాహికను పెద్దగా చేస్తారు. ఒకవేళ ముక్కులో ప్రాబ్లమ్​ ఉంటే ఇఎన్​టి స్పెషలిస్ట్​ దాన్ని సరి చేస్తారు. కొన్నిసార్లు ‘ఓరల్ అప్లయెన్సెస్​’ సాయంతో నాలుక గొంతుకి అడ్డం పడకుండా చేస్తారు.  దవడను ముందుకు తెస్తారు. దాంతో  శ్వాస తీసుకోవడం ఈజీ అవుతుంది. నాన్​–అబ్​స్ట్రక్టివ్​ స్లీప్​ ఆప్నియా ఉన్నవాళ్లకి శ్వాసవ్యవస్థని స్టిమ్యులేట్​ చేసే మెడిసిన్స్​ ఇస్తారు. వీళ్లకి పాప్​ మెషిన్స్​ కూడా హెల్ప్​ అవుతాయి.