మూడు రోజులు ఎండ ముప్పు..ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలి: డాక్టర్ రవీందర్ నాయక్

మూడు రోజులు ఎండ ముప్పు..ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలి: డాక్టర్ రవీందర్ నాయక్

హైదరాబాద్, వెలుగు: రానున్న 3 రోజుల్లో రాష్ట్రం లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీ లు పెరిగే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ బి.రవీందర్ నాయక్ శుక్రవారం హెల్త్ అడ్వైజరీ విడు దల చేశారు. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ఎండ తీవ్రత విపరీతంగా ఉంటుందని, ఈ సమయంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని తెలిపారు.

దాహం వేయకపోయినా నీళ్లు, మజ్జిగ, నిమ్మరసం, ఓఆర్ఎస్  తీసుకుంటూ డీహైడ్రేషన్ బారిన పడకుండా జాగ్రత్త పడాలని సూచించారు. ఆల్కహాల్, టీ, కాఫీలు, కార్బొనేటెడ్ కూల్ డ్రింక్స్‌‌‌‌కు దూరంగా ఉండాలని, మసాలా ఆహారాన్ని తగ్గించి నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను తీసుకోవాలని పేర్కొన్నారు. బయటకు వెళ్లేటప్పుడు కాటన్ దుస్తులు ధరించాలని, తలకు టోపీ లేదా గొడుగు తప్పనిసరిగా వాడాలని హితవు పలికారు.

ఎండ దెబ్బను నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని హెల్త్ డైరెక్టర్ హెచ్చరించారు. లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలని సూచించారు. ఇలాంటి వారిని ఆలస్యం చేయకుండా సమీపంలోని సర్కారు దవాఖానకు తరలించాలన్నారు.