కరీంనగర్ ఫొటోగ్రాఫర్/ నెట్‌వర్క్, వెలుగు: కరీంనగర్ జిల్లాలో గురువారం వర్షం దంచికొట్టింది. దీంతో ఇన్ని రోజులు ఎండతో ఇబ్బందులు పడ్డ జనానికి ఉపశమనం కలిగింది. ముఖ్యంగా కరీంనగర్సిటీలో గంటకు పైగా కుండపోతగా వాన కురిసింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. రిజిస్ట్రేషన్ ఆఫీస్ మునిగిపోయి జనం ఇబ్బందులు పడ్డారు. సిటీలో డ్రైనేజీల్లో నీళ్లు నిండి రోడ్లపై నుంచి వెళ్లాయి. ముకరంపుర, జ్యోతి నగర్, శర్మ నగర్, ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్డు, మంచిర్యాల చౌరస్తా, కలెక్టరేట్‌లో, బొమ్మకల్‌లో పిడుగుపడి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. జిల్లాలోని సైదాపూర్, గంగాధర, రామడుగు, కొత్తపల్లి, గన్నేరువరం, హుజూరాబాద్, చొప్పదండి, జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక మండలాల్లో ఈదురుగాలులతో, తేలికపాటి వర్షం కురిసింది. చాలాచోట్ల ధాన్యం కొనుగోళ్లు పూర్తవడంతో సెంటర్లు మూసేశారు.
కామారెడ్డి జిల్లాలో భారీ వర్షం
కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లాలో గురువారం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. గంటన్నర పాటు కురిసిన వర్షానికి జిల్లా కేంద్రంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. కామారెడ్డి, భిక్కనూరు, దోమకొండ, పాల్వంచ, గాంధారి, సదాశివనగర్, రామారెడ్డి, పిట్లం, బిచ్కుంద మండలాల్లో వర్షం కురిసింది. కామారెడ్డిలో 82 మి.మీ, భిక్కనూరులో 71.3 మి.మీ, దోమకొండలో 56 మి.మీ, పాలరాజంపేటలో 39.8 మి.మీ, ఎల్పుగొండలో 24.8 మి.మీ, రామారెడ్డిలో 10 మి.మీ, సదాశివనగర్ లో 9.8 మి.మీ, పిట్లంలో 7 మి.మీ, బిచ్కుందలో 5.3 మి.మీ వర్షపాతం నమోదైంది. గురువారం వార సంత కావడంతో మార్కెట్కు తీసుకొచ్చిన కూరగాయలు నీళ్లలో కొట్టుకుపోయాయి. సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి, భిక్కనూరు మండలంలోని పలు గ్రామాల్లో వడ్ల కుప్పలు తడిసిపోయాయి.
ఆసిఫాబాద్/నేరడిగొండ: ఆసిఫాబాద్ పట్టణంతో పాటు మండలంలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. మండలంలోని కోసారా గ్రామంలో చౌహాన్ దేవిదాస్ ఇంటి పై కప్పు రేకులు ఎగిరిపోయాయి. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని పలు గ్రామాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది.
