తెలంగాణలో భారీ వర్షాలు, వరదలు.. ఏఏ జిల్లాలో పరిస్థితి ఎలా ఉందంటే..

తెలంగాణలో భారీ వర్షాలు, వరదలు.. ఏఏ జిల్లాలో పరిస్థితి ఎలా ఉందంటే..

హైదరాబాద్: తెలంగాణలో భారీ వర్షాలు, వరదలు కలవరపెడుతున్నాయి. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తుంది. భారీ వర్షానికి పూల్ వాగు, పెద్దవాగు నిండుగా ప్రవహిస్తున్నాయి. మెట్ పల్లి, కోరుట్ల పట్టణంలోని లోతట్టు ప్రాంతాలలోని మురికి కాలువలు నిండుగా ప్రవహిస్తూ రోడ్లు జలమయమయ్యాయి. మంచిర్యాలా జిల్లా చెన్నూర్ మండలం అక్కేపల్లి గ్రామం సమీపంలో వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో అక్కేపల్లి-శివలింగాపూర్ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

గ్రామస్తులకు ఇదే ప్రధాన రహదారి కావడంతో రాకపోకల ఇబ్బందులు పడుతున్నారు. కోటపల్లి మండలంలోని నక్కలపల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. నక్కలపల్లి లో లెవెల్ వంతెన వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. నక్కలపల్లి లో లెవెల్ వంతెన ఉధృతంగా ప్రవహిస్తుండటంతో 4 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రమాదకరంగా ఉన్న వాగులు దాటొద్దని అధికారుల హెచ్చరికలు జారీ చేశారు.

ములుగు జిల్లాలోని బొగత జలపాతానికి వరద ప్రవాహం పోటెత్తింది. ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాలతో వరద ఉధృతి పెరుగుతుంది. వరద ప్రవాహం పెరగడంతో అటవీ శాఖ సెక్యూరిటీ సిబ్బంది తగు జాగ్రత్తలు పాటిస్తున్నారు. జలపాతం లోపలికి దిగవద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. తాండూరు మండలంలో భీమన్న వాగు పొంగిపొర్లుతుంది. సమీప గ్రామాలకు రాకపోకలు అంతరాయం ఏర్పడింది.

కొమురం భీం జిల్లా తిర్యాణిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిర్యాణి మండలంలో 108.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవడంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ముఖ్యంగా మాణిక్యపూర్, మంగి పరిసర ప్రాంతాల్లోని సుమారు 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే రొంపల్లి శివ గూడా వాగు ఉప్పొంగడంతో రహదారులు పూర్తిగా జలమయమై రవాణా సౌకర్యం నిలిచిపోయింది. దీంతో అత్యవసర పరిస్థితులు తప్ప ప్రజలు బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. 

పంగిడి, మాదార, కొలం గూడా ప్రాంతాల్లోనూ వాగులు ఉప్పొంగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు నీటితో నిండిపోవడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. అత్యవసర పరిస్థితులు మినహా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు సూచించారు. ముఖ్యంగా వాగులు, చెరువులు, లోతట్టు ప్రాంతాల వద్దకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని, రహదారులపై నీరు నిలిచిన ప్రాంతాల్లో ప్రయాణాలు చేయవద్దని హెచ్చరించారు. అలాగే పిల్లలను ఒంటరిగా బయటకు పంపవద్దని సూచించారు.

జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలో భారీ వర్షాలతో పలు గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇళ్లలోకి వరద నీరు చేరగా, చెరువులు, కాలువలు పొంగిపొర్లుతున్నాయి. నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు వెల్గటూర్ మండలంలోని రాంనూర్, కుమ్మరిపల్లి, జగదేవ్‌పేట, స్తంభంపల్లి సహా పలు గ్రామాల్లో వరద నీరు ఇళ్లలోకి చేరింది. రాంనూర్‌లో ఇళ్లలోని సామగ్రి నీట మునగగా.. జగదేవ్‌పేటలో కాలువల్లో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండగా, స్తంభంపల్లి చెరువు నిండుకుండలా మారింది. సమస్యలను వెంటనే పరిష్కరించాలని గ్రామస్థులు అధికారులను కోరుతున్నారు.