- రాష్ట్ర వ్యాప్తంగా 82.65 లక్షల ఎకరాల్లో పంటల సాగు
- వారంలోనే 20 లక్షల ఎకరాలు పెరిగిన సాగు విస్తీర్ణం
- రిజర్వాయర్లు, చెరువుల కింద జోరుగా వరినాట్లు
- సాగులో నల్గొండ, వరి నాట్లలో నిజామాబాద్ ఫస్ట్
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతాంగంలో కొత్త ఆశలు నింపాయి. ఇప్పటివరకు వర్షాభావంతో ఎండిపోతున్న మెట్ట పంటలకు ఈ వానలు ప్రాణం పోయగా, రిజర్వాయర్లు, చెరువుల్లోకి భారీగా నీరు చేరుతుండడంతో ఆయకట్టు ప్రాంతాల్లో వరినాట్లు ఊపందుకున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలు పత్తి, మక్క, కంది, సోయాబీన్ తదితర పంటలకు ఊపిరి పోశాయి. గత వారం వరకు స్లోగా సాగిన వ్యవసాయ పనులు తాజా వర్షాలతో వేగం పుంజుకున్నాయి. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, కామారెడ్డి, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, సిరిసిల్ల తదితర జిల్లాల్లో భారీ వర్షాలు పడుతుండడంతో రైతులు పత్తి, వరి, ఇతర పంటల సాగును ముమ్మరం చేశారు. ముఖ్యంగా బోర్లు, నీటి వనరుల కింద వరి నాట్లు జోరందుకున్నాయి.
వారంలోనే 20 లక్షల ఎకరాల్లో సాగు
రాష్ట్రంలో వానాకాలం సాధారణ సాగు విస్తీర్ణం 132 లక్షల ఎకరాలు. గత వారం వరకు కేవలం 60 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగు నమోదు కాగా, తాజా వర్షాలతో ఒక్క వారంలోనే దాదాపు 20 లక్షల ఎకరాల్లో కొత్తగా పంటలు వేశారు. దీంతో మొత్తం సాగు విస్తీర్ణం 82.65 లక్షల ఎకరాలకు చేరుకుంది. గతేడాది ఇదే సమయానికి 82.15 లక్షల ఎకరాల్లో సాగు నమోదు కాగా, ఈ సారి వర్షాభావ పరిస్థితుల మధ్య కూడా ఆ స్థాయిని అధిగమించడం విశేషం.
ఊపందుకున్న వరినాట్లు
రాష్ట్రంలో వరి సాధారణ సాగు విస్తీర్ణం 65.98 లక్షల ఎకరాలు. గత వారం వరకు కేవలం 11 లక్షల ఎకరాల్లో మాత్రమే నాట్లు పూర్తయ్యాయి. అయితే వరుస వర్షాల ప్రభావంతో బుధవారం నాటికి వరినాట్లు 20.46 లక్షల ఎకరాలకు చేరుకున్నాయి. కేవలం వారం రోజుల్లోనే దాదాపు 10 లక్షల ఎకరాల్లో అదనంగా నాట్లు పూర్తయ్యాయి. గతేడాది ఇదే సమయానికి 21.81 లక్షల ఎకరాల్లో వరి సాగు జరుగగా, ఈ సారి వర్షాభావం కారణంగా దాదాపు లక్షన్నర ఎకరాలు తగ్గినా, ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా మారడంతో సాగు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.
పత్తికి జీవం పోసిన వానలు
వర్షాల కోసం ఎదురుచూస్తున్న పత్తి రైతులకు తాజా వర్షాలు ఊరటనిచ్చాయి. రాష్ట్రంలో పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 47.41 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటికే 46.33 లక్షల ఎకరాల్లో సాగు జరిగింది. గతేడాది ఇదే సమయానికి 43 లక్షల ఎకరాల్లో మాత్రమే పత్తి సాగు నమోదు కాగా, ఈ సారి ఆ స్థాయిని అధిగమించింది. మొత్తంగా 98 శాతం పత్తి సాగు పూర్తి కావడం గమనార్హం. వర్షాలతో మొక్కలు కోలుకుని పెరుగుదల దశలోకి అడుగుపెడుతున్నాయని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.
పెరిగిన పప్పుధాన్యాలు, సోయాబీన్ సాగు
మక్క సాధారణ సాగు 6.16 లక్షల ఎకరాలు కాగా ఇప్పటివరకు 4.69 లక్షల ఎకరాల్లో సాగైంది. కంది సాధారణ సాగు 5.46 లక్షల ఎకరాలు ఉండగా 4.42 లక్షల ఎకరాల్లో సాగు పూర్తైంది. గతేడాదితో పోలిస్తే కంది సాగు దాదాపు 10 వేల ఎకరాలు పెరిగింది. పెసర సాధారణ సాగు 64 వేల ఎకరాలు కాగా ఇప్పటికే 63 వేల ఎకరాల్లో విత్తనాలు వేశారు. సోయాబీన్ సాధారణ సాగు 4.16 లక్షల ఎకరాలు ఉండగా, గతేడాది నమోదైన 3.55 లక్షల ఎకరాలను దాటి ఈ సారి 3.66 లక్షల ఎకరాల్లో సాగైంది.
సాగులో నల్గొండ జిల్లా ఫస్ట్
రాష్ట్రంలో పంటల సాగులో నల్గొండ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 11.22 లక్షల ఎకరాలు కాగా ఇప్పటివరకు 6.52 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. సంగారెడ్డి జిల్లాలో 7.28 లక్షల ఎకరాల సాధారణ విస్తీర్ణానికి గాను 6.05 లక్షల ఎకరాల్లో (83 శాతం) సాగు పూర్తైంది. ఆదిలాబాద్ జిల్లాలో 5.80 లక్షల ఎకరాలకు 5.86 లక్షల ఎకరాల్లో సాగు జరుగగా, నిజామాబాద్ జిల్లాలో 4.40 లక్షల ఎకరాలు, కుమ్రంభీం ఆసిఫాబాద్‌లో 4.24 లక్షలి, కామారెడ్డిలో 4.23 లక్షలు, వికారాబాద్‌లో 3.69 లక్షలు, భద్రాద్రి కొత్తగూడెంలో 3.55 లక్షలు, ఖమ్మంలో 3.32 లక్షలు, నిర్మల్‌లో 2.76 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. అలాగే నారాయణపేట జిల్లాలో 2.84 లక్షల ఎకరాల సాగు జరుగగా నాగర్‌కర్నూల్‌లో 2.72 లక్షలు, యాదాద్రి భువనగిరిలో 2.21 లక్షల ఎకరాల్లో సాగు నమోదైంది. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో మాత్రం కేవలం 8,481 ఎకరాల్లోనే పంటలు సాగయ్యాయి.
నిజామాబాద్‌లో అత్యధిక వరినాట్లు
వరి సాగులో నిజామాబాద్ జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. జిల్లాలో 3.30 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పూర్తయ్యాయి. కామారెడ్డిలో 2.02 లక్షల ఎకరాలు, కరీంనగర్‌లో 1.49 లక్షల ఎకరాలు, పెద్దపల్లిలో 1.24 లక్షల ఎకరాలు, మెదక్‌లో 1.20 లక్షల ఎకరాలు, సిద్దిపేటలో 1.15 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. అలాగే సూర్యాపేటలో 1.12 లక్షల ఎకరాలు, యాదాద్రి భువనగిరిలో 1.12 లక్షల ఎకరాలు, జనగాంలో 95 వేల ఎకరాలు, నల్గొండలో 70 వేల ఎకరాల్లో వరి నాట్లు పూర్తయ్యాయి. భూపాలపల్లి జిల్లాలో 16 వేల ఎకరాలు, జోగులాంబ గద్వాల జిల్లాలో తక్కువగా 7,914 ఎకరాల్లోనే వరి సాగు నమోదైంది.
రైతుల్లో పెరిగిన ఆశలు
ఇన్నాళ్లు వర్షాభావంతో ఆందోళన చెందిన రైతులకు తాజా వర్షాలు ఊరటనిచ్చాయి. చెరువులు, రిజర్వాయర్లలో నీటిమట్టాలు పెరగడంతో వరినాట్లు మరింత వేగం పుంజుకునే అవకాశముందని వ్యవసాయ శాఖ అధికారులు భావిస్తున్నారు. మరోవైపు మెట్ట ప్రాంతాల్లో పత్తి, మక్క, కంది, సోయాబీన్ తదితర పంటలు కోలుకోవడంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. రానున్న రోజుల్లో కూడా వర్షాలు కొనసాగితే వానాకాలం సాగు సాధారణ లక్ష్యాన్ని చేరుకునే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
