హైదరాబాద్ సిటీలో వానతో ఆగమాగం.. లక్డీకాపూల్, మాసబ్ ట్యాంక్ వైపు వెళ్లే పని పడిందా..?

హైదరాబాద్ సిటీలో వానతో ఆగమాగం.. లక్డీకాపూల్, మాసబ్ ట్యాంక్ వైపు వెళ్లే పని పడిందా..?
  • ముషీరాబాద్‌‌‌‌లో 4.47 సెం.మీ.
  • ఆఫీసులు వదిలిన వేళ ఆగమాగం చేసిన వర్షం

సిటీ నెట్వర్క్​, వెలుగు: హైదరాబాద్ నగరంలో మంగళవారం సాయంత్రం కురిసిన వానతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఉదయం నుంచి ఎండగా కొట్టగా, సాయంత్రం 5 గంటలకు షురువైన వాన రెండు గంటల పాటు దంచి కొట్టింది. సిటీలోని మెయిన్​రోడ్లు, లోతట్టు ప్రాంతాలు కాలువలను తలపించాయి. జీహెచ్‌‌‌‌ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఆఫీసులు ముగిసి ఇంటికి వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ముషీరాబాద్​లో 4.7 సె.మీ, మియాపూర్, కవాడిగూడ, అమీర్ పేట్, కూకట్ పల్లి, మూసాపేట్, యూసుఫ్​గూడ, మెట్టుగూడ, గోల్కొండ, ఖైరతాబాద్ కాప్రా, అల్వాల్ , అల్విన్ కాలనీల్లో 3, తార్నాకలో 4.6, బన్సిలాల్ పేటలో 4. 3, జూబ్లీహిల్స్ లో 4, భోలక్ పూర్ లో 3.9, బోయిన్​పల్లిలో 3.8, బోరబండలో 3.8 సెం.మీ. వాన పడింది.

ట్రాఫిక్ జామ్.. 
వానతో హైటెక్ సిటీ, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, హఫీజ్​పేట్, బొటానికల్ గార్డెన్, కొత్తగూడ, మియాపూర్, మదీనగూడ, చందానగర్, లింగంపల్లి, గంగారం, మెహదీపట్నం, టోలిచౌకి, మాసాబ్ ట్యాంక్, నాంపల్లి, ప్యారాడైజ్, యాకత్‌‌‌‌పుర, చార్మినార్, బహదూర్‌‌‌‌‌‌‌‌పుర ప్రాంతాలతో పాటు సనత్‌‌‌‌నగర్, ఎస్సార్ నగర్, అమీర్‌‌‌‌పేట్, పంజాగుట్ట, సోమాజీగూడ, ఖైరతాబాద్‌‌‌‌లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి.

పీవీఎన్‌‌‌‌ఆర్ ఎక్స్‌‌‌‌ప్రెస్‌‌‌‌ వేపై పిల్లర్ నెం.250 సమీపంలో రెండు వైపులా నీరు నిలిచిపోవడంతో వాహనాల వేగం మందగించింది. దీంతో ఎయిర్​పోర్ట్​కు వెళ్లే వారు టెన్షన్​ పడ్డారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి ఎలివేటెడ్ కారిడార్ పిల్లర్ నంబర్ 96 వద్ద నేషనల్​హైవేపై భారీగా వర్షపు నీరు చేరడంతో..డీఆర్‌‌‌‌ఎఫ్ టీమ్స్ పోలీసులు జనరేటర్లతో నీటిని బయటకు పంపించి ట్రాఫిక్‌‌‌‌ క్లియర్ చేశారు. పంజాగుట్ట నిమ్స్ ప్రాంతంలోనూ రోడ్డుపై భారీగా నీరు నిలిచింది. గతంలో చేపట్టిన పైప్‌‌‌‌లైన్ పనుల కారణంగా నీరు క్లియర్​ కావడంతో కష్టాలు తప్పాయి.

ఆఫీసుల నుంచి వచ్చే టైం కావడంతో.. 
వర్షం కారణంగా ఆఫీసులు, కాలేజీలు, స్కూల్స్ నుంచి ఇండ్లకు వచ్చే టైం కావడంతో వాహనదారులు, పాదచారులు రోడ్లపై నిలిచిన నీటిలో నడవలేక అవస్థలు పడ్డారు. అసెంబ్లీ ఎదురుగా రవీంద్రభారతి నుంచి పోలీస్ కంట్రోల్ రూమ్ వైపు వెళ్లే రోడ్డు పూర్తిగా నీట మునిగింది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని బాచుపల్లి ఫ్లైఓవర్ కింద, సూరారం చౌరస్తాలో రోడ్డుపై భారీగా వరద నిలిచింది. గాజులరామారం రాంకీ అపార్ట్‌‌‌‌మెంట్ వద్ద, మల్లారెడ్డి నగర్ రోడ్లపై వరద చేరడంతో ఇబ్బందులు పడ్డారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
భారీ వర్షాల నేపథ్యంలో నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ జోయల్ డేవిస్ సూచించారు. డీసీపీలు అవినాష్ కుమార్, కాజల్ సింగ్, రాహుల్ హెగ్డేతో కలిసి లక్డీకాపూల్, అయోధ్య జంక్షన్, మాసబ్ ట్యాంక్‌‌లోని పీటీఐ వంటి ప్రధాన వాటర్ లాగింగ్ పాయింట్లను పరిశీలించారు.