- ప్రధానంగా ఆరు అంశాలపై రివ్యూ
- హాజరుకానున్న సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్,
- ఇన్చార్జిలు, ముఖ్య నేతలు
న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రంలో పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడంపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. ‘సంఘటన్ సృజన్ అభియాన్’ పేరిట దేశవ్యాప్తంగా ఈ నెల 21 నుంచి రాష్ట్రాల వారీగా సమీక్షలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా సోమవారం తెలంగాణతో పాటు వెస్ట్ బెంగాల్ రివ్యూ ఏర్పాటు చేసింది.
ఢిల్లీలోని ఇందిరా భవన్‌లో పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఇంచార్జ్‌లు, ఇతర ముఖ్యనేతలు హాజరుకానున్నట్లు ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం, పార్టీ మధ్య సమన్వయాన్ని మరింత పెంచడంతో పాటు క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసే అంశాలపై హైకమాండ్ దిశానిర్దేశం చేయనుంది.
ప్రధానంగా 2025–26ను ‘సంస్థాగత సంస్కరణల ఏడాది’గా పార్టీ ప్రకటించిన క్రమంలో రాష్ట్రంలో పార్టీ యంత్రాంగాన్ని బూత్ స్థాయి వరకు ఏ మేరకు పటిష్టం చేశారనే అంశంపై ఈ సమీక్షా సమావేశంలో చర్చించనున్నారు. ప్రధానంగా ఏఐసీసీ సూచించిన 6 అజెండా అంశాలపై రాష్ట్ర ముఖ్య నేతలు అధిష్టానానికి నివేదిక ఇవ్వనున్నట్లు తెలిసింది.
ఈ ఆరు అజెండా అంశాలలో.. నాయకుల్లో నైపుణ్యం పెంచేందుకు చేపట్టిన శిక్షణ కార్యక్రమాలు(ట్రెయినింగ్ ప్రోగ్రాంలు), పార్టీ క్రమశిక్షణతో పాటు నిరంతరం జరుగుతున్న సమీక్షా సమావేశాలు (క్రమశిక్షణ రివ్యూలు), బూత్, మండల, జిల్లా స్థాయిల్లో సంస్థాగత కమిటీల ఏర్పాటు (కమిటీల నిర్మాణం), కార్యకర్తలకు, నాయకులకు అప్పగించిన స్పష్టమైన విధులు (బాధ్యతల విభజన), కాంగ్రెస్ కనెక్ట్ యాప్ వినియోగం, నమోదు పురోగతి(డిజిటల్ ప్లాట్‌ఫామ్), నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కనెక్ట్ సెంటర్ల పనితీరు (కనెక్ట్ సెంటర్లు) వంటివి ఉన్నాయి.
