హైదరాబాద్, వెలుగు: సంగారెడ్డి జిల్లాపాశమైలారంలోని సిగాచి ఫ్యాక్టరీ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమిత్‌రాజ్ సిన్హాకు హైకోర్టు మంగళవారం బెయిలు మంజూరు చేసింది. అతడితోపాటు స్వతంత్ర డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు రవీంద్రప్రసాద్ సిన్హా, బిందు వినోదన్, ధనలక్ష్మి, ఎద్దుల జనార్దన్ రెడ్డి తదితరులకు షరతులతో కూడిన బెయిలు ఇచ్చింది. సిగాచి ఫ్యాక్టరీలో పేలుడుతో 54 మంది మృతి చెందిన సంఘటనలో నమోదైన కేసులో భాగంగా అరెస్టయిన ఎండీ అమిత్‌రాజ్ సిన్హా రెగ్యులర్ బెయిలు, మిగిలిన డైరెక్టర్లు ముందస్తు బెయిలు కోరుతూ వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.
వీటిపై జస్టిస్ కె. సుజన విచారణ చేపట్టి నిందితులకు బెయిలు మంజూరు చేశారు. డైరెక్టర్లు సంబంధిత మేజిస్ట్రేట్ కోర్టులో లొంగిపోవాలని, అనంతరం రూ. లక్షచొప్పున వ్యక్తిగత బాండు, అంతే మొత్తానికి మరో ఇద్దరి పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించారు. విచారణకు సహకరించాలని, సాక్షులను ప్రభావితం చేయడానికి, సాక్ష్యాల తారుమారుకు ప్రయత్నించరాదని షరతు విధించారు.
