కేబినెట్ నిర్ణయంపై అంత గుట్టెందుకు?

కేబినెట్ నిర్ణయంపై అంత గుట్టెందుకు?
  • దాంతోనే అనుమానాలు పెరిగిపోతాయన్న హైకోర్టు
  • బస్సు రూట్లపై ఆర్టీసీ ఒపీనియన్​ ఎందుకు తీసుకోలేదని ప్రశ్న
  • గెజిట్‌, జీవో తర్వాతే ప్రశ్నించాలనడం సరికాదు
  • ఎర్రమంజిల్​ కూల్చివేత కేసులో అవేవీ లేకుండానే విచారించాం
  •  ఏళ్ల తరబడి జీవో రాకుండా ఏం చేయాలో చెప్పండి
  • ఆర్టీసీ రూట్ల ప్రైవేటుపై స్టే కొనసాగింపు
  • ప్రతివాదిగా కేంద్ర ప్రభుత్వం.. విచారణ 18కి వాయిదా

హైదరాబాద్, వెలుగు:

‘‘ఆర్టీసీలో రూట్లను ప్రైవేటు చేసే తంతు ఎలా ఉందంటే ఎద్దుల్ని కట్టడానికి బదులు.. ముందే బండిని కట్టేసిట్లుగా ఉంది. కేబినెట్‌ డెసిషన్‌ గుట్టుగా ఉండే కొద్దీ అనుమానాలు, ఆపై అపోహలు పెరిగిపోతాయి. చీకట్లోనే ఉంటే సందేహాలు బుర్రను తొలిచేస్తాయి. అదే అధికారిక వెబ్‌సైట్‌లో ఆ నిర్ణయాన్ని పెట్టి ఉంటే ప్రజలకు సమాచారాన్ని అందించినట్లు అవుతుంది. ట్రాన్స్​పరెంట్​గా కూడా ఉంటుంది. గుట్టుగా ఉండే కొద్దీ గందరగోళానికి తెరతీసినట్లే” అని హైకోర్టు పేర్కొంది. ఆర్టీసీలో 5,100 రూట్లను ప్రైవేటు చేయాలని కేబినెట్​ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ తెలంగాణ జన సమితి నేత, ప్రొఫెసర్‌ పీఎస్‌ విశ్వేశ్వర్‌ రావ్‌ దాఖలు చేసిన పిల్‌ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ అభిషేక్‌రెడ్డితో కూడిన డివిజన్‌ బెంచ్‌ గురువారం మరోసారి విచారించింది. ఆర్టీసీలో అన్ని రూట్లనూ ప్రైవేటు చేస్తున్నట్లుగా పిల్‌ వేశారని, 5,100 రూట్ల విషయంలోనే ఆ నిర్ణయమని, దీనికి అనుగుణంగా పిల్​ను సరిచేసి మళ్లీ దాఖలు చేయాలని పిటిషనర్‌ తరపు లాయర్‌ చిక్కుడు ప్రభాకర్‌ను బెంచ్​ఆదేశించింది. విచారణను18కి వాయిదా వేస్తున్నామని, అప్పటివరకూ కేబినెట్​తీసుకున్న రూట్ల ప్రైవేటు నిర్ణయంపై స్టే ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టంచేసింది. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చేందుకు పిటిషనర్‌కు అనుమతి ఇచ్చింది. కౌంటర్‌ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.

ప్రభుత్వ వాదనలో పసలేదు

‘‘రూట్లను ప్రైవేటుకు ఇచ్చే అంశంలో ఆర్టీసీ అభిప్రాయాన్ని తెలుసుకోకుండా ఆ పనుల్ని రోడ్​ట్రాన్స్‌పోర్ట్​అథారిటీ(ఆర్‌టీఏ)కి ఇవ్వడం ఏమిటో అర్థంకావడం లేదు. కేబినెట్‌ నిర్ణయం తర్వాత గెజిట్‌, ఆపై ప్రభుత్వ ఉత్తర్వు(జీవో) అయ్యాకే ఎవరైనా ప్రశ్నించవచ్చన్న ప్రభుత్వ వాదనలో పసలేదు. ఎర్రమంజిల్‌లో చారిత్రక భవనాన్ని కూల్చి అక్కడే అసెంబ్లీ కాంప్లెక్స్‌ కట్టాలని కేబినెట్​చేసినతీర్మానంపై గెజిట్, జీవో రాకుండానే ఇదే హైకోర్టు ఇటీవలే విచారణ చేసింది. అప్పటి కేబినెట్‌ తీర్మానాన్ని కొట్టేస్తూ ఉత్తర్వులు కూడా ఇచ్చాం. ఇప్పుడు ఆర్టీసీలో 5,100  రూట్లను ప్రైవేటు చేసే విషయంలో కేబినెట్‌ తీర్మానంపై పిల్‌ మా ముందు ఉంది. రూట్ల ప్రైవేటుకు చట్టబద్ధత ఉందో లేదో అనేది వేరే విషయం. కేబినెట్ ఒక తీర్మానం చేసి ఏళ్ల తరబడి జీవో ఇవ్వకుండా ఉంటే అప్పుడేం చేయాలో కూడా వివరించాలి”అని రాష్ట్ర సర్కార్​ను హైకోర్టు ఆదేశించింది.

అది పూర్తిగా రహస్యం

బస్సు రూట్ల ప్రైవేటుపై కేబినెట్​నిర్ణయం పూర్తిగా రహస్యమని, అది అమలు కావాలంటే ఎంవీ యాక్ట్‌ కింద గెజిట్‌, ఆపై జీవో విడుదల కావాలని, ఈ తంతు పూర్తి కాకుండా కేబినెట్‌ నిర్ణయం ఆధారంగా హైకోర్టులో సవాల్‌ చేయడం చెల్లదని అడ్వొకేట్‌జనరల్‌(ఏజీ) బీఎస్‌ ప్రసాద్‌ వాదించారు. కేబినెట్‌తీర్మానం ప్రతిని సీల్డ్‌కవర్‌లో కోర్టుకు సమర్పించారు. దానిని పరిశీలించిన బెంచ్‌.. ఆర్టీసీ చట్టంలోని102 సెక్షన్‌ కింద తీర్మానం చేశారని, తీర్మానానికి ఆ సెక్షన్‌కు సంబంధం లేదని అభిప్రాయపడింది. రూట్ల ప్రైవేటుపై నిర్ణయానికి ముందు ఆర్టీసీకి నోటీసులిచ్చి అధికారికంగా ఒపీనీయన్‌ తెలుసుకోవాలన్న నిబంధనను సర్కార్‌పాటించలేదని తప్పుపట్టింది. ఆర్టీసీకి బదులు ఆర్‌టీఏకి అధికారం ఇవ్వడం సబబు కాదని, ఆర్టీఏ అయినా ఆర్టీసీ ఒపీనియన్‌ కోరలేదని ఎత్తిచూపింది. కేబినెట్‌నిర్ణయం తర్వాత జీవో జారీ గురించి ఆర్టీసీ యాక్ట్‌ 67–3 సెక్షన్‌లో ప్రస్తావన లేదని చెప్పింది.

ఏండ్ల తరబడి జీవో రాకపోతే ఏం చేయాలి

ఇన్ఫర్మేషన్‌ యాక్ట్‌లోని సెక్షన్ 8(1) ప్రకారం కేబినెట్‌ తీర్మానాల గురించి సమాచారం తీసుకునేందుకు ఆస్కారం లేదని ఏజీ వాదించారు. కేబినెట్‌ తీర్మానం గుట్టుగా ఉండాలన్న సర్కార్‌ వాదనే కరెక్టు అనుకుంటే, ఊహాగానాలతో పిల్‌ వేశారని ఎలా వాదిస్తారని సర్కార్‌ను బెంచ్‌ నిలదీసింది. కేబినెట్​నిర్ణయం తీసుకున్నా ఏండ్ల తరబడి జీవో జారీచేయకపోతే ఏంచేయాలోచె ప్పాలని ఏజీని ఆదేశించింది. ‘‘ప్రజలకు సంబంధించిన విషయంలో కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. పత్రికల్లో వచ్చిన సమాచారమే మా దగ్గర కూడా ఉంది. పిటిషనర్‌ దగ్గర కూడా అంతకంటే సమాచారం ఉండదు. అందుకే కోర్టుకు వచ్చారని ప్రభుత్వం గుర్తించాలి”అని బెంచ్‌ సూచించింది.

విచారణ 18కి వాయిదా

హైకోర్టు స్టే కారణంగా ఆర్టీఏ, ఆర్టీసీ ఒపీనియన్‌, సీల్డ్‌కవర్‌లోని సమాచారంపై ఏజీతోపాటు రవాణా శాఖ కమిషనర్‌ సందీప్‌కుమార్‌సుల్తానియా బెంచ్‌ దగ్గరకు వెళ్లి పదినిమిషాలపాటు ముఖాముఖీ వివరించారు. ఈ సమయంలో కోర్టులో మైక్‌లు స్విచ్ఛాఫ్‌ చేశారు. ఆ తర్వాత పిటిషనర్‌ సవరణ పిల్​దాఖలు చేయాలని ఆదేశిస్తూ బెంచ్ విచారణను18వతేదీకి వాయిదా వేసింది. ఆర్టీసీ అద్దె బస్సుల లీజు నోటిఫికేషన్‌పై దాఖలైన కేసు విచారణ కూడా 18కి వాయిదా పడింది. లీజుల్ని ఖరారు చేశామని, లీజుదారుల వాదనలు వినాల్సి వుందనిఅ డిషనల్‌ ఏజీ రామచందర్‌రావ్‌ చెప్పడంతో లీజుదారులు కూడా కౌంటర్‌ వేయాలని బెంచ్‌ఆదేశించింది. ఆర్టీసీ కార్మికుల సెప్టెంబర్‌ నెల జీతాల చెల్లింపులపై పిల్​ విచారణ19కి వాయిదా పడింది.

High Court hearing on cabinet's decision to privatize 5,100 routes in RTC