- 22,400 పైన నిఫ్టీ
ముంబై : బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు సెన్సెక్స్, నిఫ్టీ గురువారం సెషన్‌లో ఇంట్రాడే నష్టాల నుంచి కోలుకొని ఒక శాతం లాభంతో ముగిశాయి. గ్లోబల్ మార్కెట్‌లు పాజిటివ్‌గా ట్రేడవ్వడం కలిసొచ్చింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇన్ఫోసిస్ షేర్లలో కొనుగోళ్లు పెరగడంతో సెన్సెక్స్ గురువారం 677 పాయింట్లు (0.93 శాతం) పెరిగి 73,664 దగ్గర ముగిసింది. ఇంట్రాడేలో ఈ ఇండెక్స్ 72,530 వరకు పడింది. నిఫ్టీ 203 పాయింట్లు లాభపడి 22,404 దగ్గర సెటిలయ్యింది.
యూఎస్ ఇన్‌ఫ్లేషన్ అంచనాల కంటే తక్కువగా నమోదవ్వడంతో మార్కెట్‌లో బయ్యింగ్ కనిపించిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ అన్నారు. ఈ ఏడాది ఫెడ్ రెండు సార్లు వడ్డీ రేట్లను తగ్గించొచ్చని అంచనా వేశారు. సెన్సెక్స్‌లో మహీంద్రా అండ్ మహీంద్రా, ఎయిర్‌టెల్, టెక్ మహీంద్రా, టైటాన్, ఇన్ఫోసిస్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎల్ అండ్ టీ, కోటక్ బ్యాంక్ షేర్లు ఎక్కువగా పెరిగాయి.
మారుతి, ఎస్‌బీఐ, పవర్ గ్రిడ్, టాటా మోటార్స్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. వోలటాలిటీలో కదిలిన మార్కెట్ చివరికి లాభాల్లో ముగిసిందని రెలిగేర్ బ్రోకింగ్ ఎనలిస్ట్ అజిత్ మిశ్రా పేర్కొన్నారు. ఇంట్రాడే నష్టాల నుంచి రికవరీ అవుతున్న ట్రెండ్ కొనసాగిందని అన్నారు.
