
- సీబీఐ అప్పీల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
హైదరాబాద్, వెలుగు: ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో బీఆర్‌ఎస్ నేత సబితా ఇంద్రారెడ్డికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో ఆమె పాత్రను గుర్తించడంలో సీబీఐ కోర్టు విఫలమైందంటూ సీబీఐ దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్‌ను హైకోర్టు సోమవారం విచారించింది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉండగా గనుల శాఖ మంత్రిగా చేసిన సబితా ఇంద్రారెడ్డి, పరిశ్రమల శాఖ కార్యదర్శిగా చేసిన కృపానందం (రిటైర్డ్ ఐఏఎస్)కు తాజాగా నోటీసులిచ్చింది.
ఓబుళాపురం అక్రమ మైనింగ్‌పై పోలీసులు దాఖలు చేసిన చార్జిషీట్‌లో 8, 9వ నిందితులుగా ఉన్న వారిద్దరినీ నిర్దోషులని పేర్కొంటూ సీబీఐ కోర్టు గత మే 6న తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును రద్దు చేయాలంటూ సీబీఐ వేసిన అప్పీల్ పిటిషన్‌ను జస్టిస్ కె.లక్ష్మణ్ విచారించారు. ఇదే కేసులో సీబీఐ కోర్టు శిక్ష పడిన గాలి జనార్దన్ రెడ్డి, బీవీ శ్రీనివాస రెడ్డి ఇతరులు దాఖలు చేసిన అప్పీళ్లతో కలిపి సీబీఐ అప్పీల్‌ను సెప్టెంబర్ 17న విచారిస్తామన్నారు.
తొలుత సీబీఐ అడ్వకేట్ వాదిస్తూ, బీవీ శ్రీనివాస రెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి, గాలి జనార్దన్ వ్యక్తిగత సహాయకుడు మెఫజ్ అలీఖాన్, గనుల శాఖ మాజీ డైరెక్టర్ వీడి రాజగోపాల్‌కు సీబీఐ కోర్టు శిక్ష విధించిందన్నారు. 8, 9వ నిందితులైన కృపానందం, సబితా ఇంద్రారెడ్డి పాత్ర కూడా ఉందనేందుకు ఆధారాలు ఉన్నాయని చెప్పారు. వీరిద్దరి పాత్రపై ఉన్న పత్రాలను సీబీఐ కోర్టు పరిగణనలోకి తీసుకోలేదన్నారు.