చట్టాన్ని కాపాడాల్సిన ఎస్సై.. చట్ట వ్యతిరేక పనులకు పాల్పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఒంటరి మహిళను లొంగదీసుకుని వేధింపులకు గురి చేస్తుండటం తెలంగాణ పోలీసు వర్గాల్లో కలకలం రేకెత్తించింది. శుక్రవారం (ఏప్రిల్ 17) జమ్మికుంట SI పై అత్యాచార కేసు నమోదవ్వటం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.
వివరాల్లోకి వెళ్తే.. జమ్మికుంట ఎస్సై కదిర శ్రీకాంత్ పై వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధి లోని సుబేదారి పోలీస్ స్టేషన్ లో అత్యాచారం కేసు నమోదయింది. హనుమకొండలోని సుబేదారికి చెందిన ఓ మహిళా భర్త చనిపోవడంతో పిల్లలతో కలిసి జీవనం సాగిస్తోంది. ఆ మహిళ కు ఎస్సై శ్రీకాంత్ ఫేస్బుక్ ద్వారా పరిచయమయ్యా రు. కొంతకాలంగా ఆ మహిళతో స్నేహంగా ఉంటూ దగ్గరయ్యారు.
ఎస్సై శ్రీకాంత్ తనను లొంగదీసుకుని అత్యాచారం చేశారంటూ బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను చెప్పినట్టుగా వినక పోతే నగ్న ఫోటోలు బయటపెడతానని బెదిరించినట్లుగా ఆరోపించింది. తాను చెప్పినట్టుగా వినాలని.. తరచూ బెదిరిస్తూ పలుమార్లు అత్యాచారం చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.
న్యూడ్ కాల్స్ చేయాలంటూ తరచూ బెదిరింపులకు గురి చేస్తు శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నట్లు మహిళ ఫిర్యాదు చేసింది. నిత్యం ఎస్సై బెదిరింపులు తట్టుకోలేక పోతున్నానని తెలిపింది. తనకు ఎస్సై నుంచి రక్షణ కల్పించాలని సుబేదారి పోలీసులకు మహిళ పిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదు స్వీకరించిన ఉన్నతాధికారులు.. ఎస్సై శ్రీకాంత్ పై 64, 351 సెక్షన్ల కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

