V6 News

అప్పటి వరకు హుండీలో డబ్బులు వేయం : కొండగట్టు ఆంజనేయ స్వామి భక్తుల తిరుగుబాటు

అప్పటి వరకు హుండీలో డబ్బులు వేయం : కొండగట్టు ఆంజనేయ స్వామి భక్తుల తిరుగుబాటు

జై హనుమాన్.. జై బజరంగబలి.. మహా వీర హనుమాన్ కీ జై.. ఈ స్లోగన్స్ వింటే చాలు ఓ ఎమోషన్.. జై ఆంజనేయ.. ఇలాంటి స్లోగన్స్ మనస్సులో అనుకున్నా చాలు దైర్యం వస్తుంది. తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఎంతో విశిష్ఠత ఉన్న మన కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి ఉన్న మహత్యం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 

కొండగట్టు ఆలయానికి భక్తులు పోటెత్తుతుంటారు. ఆంజనేయ స్వామి దీక్షలు చేపడుతుంటారు భక్తులు. అలాంటి కొండగట్టు ఆలయం నిర్వహణ.. ఆయలంలో వసతులపై ఇప్పుడు హనుమాన్ భక్తులు గరం అవుతున్నారు. కొండగట్టు ఆలయానికి వస్తే కనీసం వసతులు ఉండటం లేదని.. అలాంటప్పుడు హుండీలో ఎందుకు డబ్బులు వేయాలంటూ వీర హనుమాన్ భక్తులు ప్రశ్నిస్తున్నారు. అంతేనా.. హుండీలో లేఖలు రాసి వేస్తున్నారు హనుమాన్ భక్తులు. 

కొండగట్టు ఆలయంలో సౌకర్యాలు కల్పించేంత వరకు హుండీలో డబ్బులు వేయమని లెటర్లు రాసి.. పదుల సంఖ్యలో హుండీలో వేశారు. 2026, ఏప్రిల్ 2వ తేదీ జరిగిన హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాలు జరిగాయి. ఉత్సవాలు 16 రోజులకు సంబంధించిన.. ఆలయంలో ఏర్పాటు చేసిన 14 హుండీలను ఆలయ ఈవో అంజనా రెడ్డి ఆధ్వర్యంలో లెక్కింపు చేపట్టారు. హుండీల లెక్కింపులో భాగంగా పదుల సంఖ్యలో లెటర్లు బయటపడ్డాయి. 

కొండగట్టులో భక్తులకు తీవ్రమైన అసౌకర్యాలు ఉన్నాయి.. కోనేరులో నీరు శుభ్రంగా ఉండటం లేదు.. మరుగుదొడ్ల (టాయిలెట్స్) కంపు కొడుతున్నాయి. టాయిలెట్స్ శుభ్రంగా లేవు. కనీసం మంచి నీళ్లు కూడా ఆలయం పరిసరాల్లో ఏర్పాటు చేయటం లేదు. ఆలయం పరిసరాలు శుభ్రంగా ఉండటం లేదు. కనీస సౌకర్యాలు లేవు. ఉత్సవాల సందర్భంగా ఆలయానికి వచ్చిన హనుమాన్ భక్తులు.. వారు ఎదుర్కొన్న బాధలు, సమస్యలను కాగితం రాసి.. హుండీలో వేశారు.  

కొండగట్టు ఆలయంలో సౌకర్యాలు కల్పించే వరకు హుండీలో డబ్బులు వేయొద్దని పిలుపునిచ్చారు ఈ వీర హనుమాన్ భక్తులు. మేం ఆలయానికి వచ్చినా హుండీలో డబ్బులు వేయం అని.. మిగతా హనుమాన్ భక్తులు కూడా ఇదే విధంగా హుండీలో డబ్బులు వేయొద్దని.. సౌకర్యాలు కల్పించే వరకు ఈ నిరసన వ్యక్తం చేయాలంటూ పిలుపునిచ్చారు ఆ భక్తులు. కొండగట్టుకు సమర్పించే కానుకలతో.. మా గ్రామాల్లోని హనుమాన్ ఆలయాల అభివృద్ధికి ఖర్చు చేస్తామని అంటూ స్పష్టం చేశారు.

కొండగట్టు ఆలయం అభివృద్ధికి ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ ఇవ్వాలని కోరారు. టీటీడీ నిధులతో అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత సైతం అధికారుల్లో కనీసం మార్పు లేదని ఈ భక్తులు భావించినట్లు ఉంది. కొండగట్టు ఆలయంలో హుండీలో లెక్కింపు సందర్భంగా బయటపడిన ఈ లేఖలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించిన.. కనీస సౌకర్యాలు, పరిశుభ్రత విషయంలో చర్యలు తీసుకుంటారో లేదో చూడాలి.