V6 News

డయాబెటిస్ లో కొత్త రకం : లక్షల మందికి తప్పుడు చికిత్స జరుగుతోందని నిపుణుల హెచ్చరిక!

డయాబెటిస్ లో కొత్త రకం : లక్షల మందికి తప్పుడు చికిత్స జరుగుతోందని నిపుణుల హెచ్చరిక!

చాలా కాలంగా డయాబెటిస్ అంటే కేవలం టైప్ 1, టైప్ 2 అని మాత్రమే మనకు తెలుసు. కానీ ఇప్పుడు 'టైప్ 5 డయాబెటిస్' అనే కొత్త రకాన్ని అంతర్జాతీయ మధుమేహ సమాఖ్య గుర్తించింది. అయితే దీనిపై సరైన అవగాహన లేక లక్షలాది మందికి తప్పుడు చికిత్స జరుగుతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

టైప్ 5 డయాబెటిస్ అంటే ఏమిటి
సాధారణంగా మధుమేహం అంటే అతిగా తినడం వల్ల లేదా వంశపారంపర్యంగా వస్తుందని అనుకుంటాం. కానీ టైప్ 5 డయాబెటిస్ అనేది ముఖ్యంగా  దీర్ఘకాలిక పోషకాహార లోపం అంటే సరైన తిండి లేకపోవడం వల్ల వస్తుంది. అందుకే దీనిని 'మాల్‌న్యూట్రిషన్ రిలేటెడ్ డయాబెటిస్' (MRDM) అని కూడా పిలుస్తారు.

టైప్ 1 రోగనిరోధక శక్తి సమస్య వల్ల వస్తుంది. టైప్ 2 ఇన్సులిన్ సరిగ్గా పని చేయకపోవడం వల్ల వస్తుంది. కానీ టైప్ 5 చిన్నతనం నుండి సరైన పోషకాహారం అందకపోవడం వల్ల ప్యాంక్రియాస్ దెబ్బతిని, ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల వస్తుంది.

ఎవరికి ప్రమాదం 
ఆసియా, ఆఫ్రికా వంటి పేద, మధ్యతరగతి దేశాల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఆహార భద్రత లేని ప్రాంతాల్లోని ప్రజలు దీని బారిన పడుతున్నారు. చాలా మంది డాక్టర్లు దీనిని టైప్ 1 లేదా టైప్ 2 గా పొరబడతారు. ఎందుకంటే దీనిపై ఇంకా పూర్తిస్థాయి అవగాహన లేదు. సాధారణంగా చేసే టెస్టులు ఈ రకమైన డయాబెటిస్‌ను సరిగ్గా గుర్తించలేవు. దీనివల్ల రోగులకు అవసరం లేని లేదా తప్పుడు మందులు ఇచ్చే అవకాశం ఉంది.

తప్పుడు చికిత్స వల్ల కలిగే నష్టాలు
టైప్ 2 మందులు వీరికి పని చేయకపోవచ్చు. అవసరానికి మించి ఇన్సులిన్ ఇస్తే, రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పడిపోయి  ప్రమాదం కలగవచ్చు. టైప్ 5 డయాబెటిస్ ఉన్నవారికి కేవలం మందులు ఇస్తే సరిపోదు. వారికి సరైన పోషకాహారం అందించాలి. వ్యక్తిగత అవసరాలకు తగ్గట్టుగా ఇన్సులిన్ మోతాదును నిర్ణయించాలి. తరచుగా షుగర్ లెవల్స్‌ను చెక్ చేస్తూ ఉండాలి.

డయాబెటిస్ అంటే కేవలం లగ్జరీ లైఫ్ స్టయిల్  వల్ల వచ్చేది మాత్రమే కాదు, అది పేదరికం,  పోషకాహార లోపం వల్ల కూడా రావచ్చని టైప్ 5 డయాబెటిస్ నిరూపిస్తోంది. ప్రభుత్వం, ఆరోగ్య సంస్థలు దీనిపై త్వరగా స్పందించి కొత్త మార్గదర్శకాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది.