ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'దేశముదురు' చిత్రంతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న నటి హన్సిక మోత్వానీ. పెళ్లి తర్వాత సినిమాలకు బ్రేకప్ ఇచ్చిన ఈ భామ గత కొద్ది రోజులుగా నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల తన భర్త , వ్యాపారవేత్త సోహైల్ కతూరియా నుంచి విడిపోయారు. ఈ విడాకుల వివాదంపై లేటెస్ట్ గా హన్సిక స్పందించారు.
తప్పుడు రైలు ఎక్కితే దిగిపోవడమే మేలు..
తన జీవితంపై వస్తున్న విమర్శపై లేటెస్ట్ గా ఒక ఇంటర్వ్యూలో గట్టిగా సమాధానమిచ్చారు హన్సిక. నా జీవితంలో జరిగిన దేనికీ నేను బాధపడటం లేదు. తప్పుడు రైలు ఎక్కామని తెలిసినప్పుడు, అందులో ప్రయాణించి బాధపడటం కంటే మధ్యలోనే దిగిపోవడం మంచిది. నాకు నా కుటుంబం నుండి పూర్తి మద్దతు ఉంది. ప్రస్తుతానికి నేను చాలా సంతోషంగా ఉన్నాను.
పెళ్లి, పిల్లలపై ఒత్తిడి
సమాజంలో ఆడవారిపై ఉండే పెళ్లి, పిల్లల ఒత్తిడి గురించి హన్సిక ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 25 ఏళ్లకు పెళ్లి చేసుకోవాలని కొందరు, 30కి చేసుకోవాలని మరికొందరు అంటారు. అసలు ఈ నియమాలు పెట్టేది ఎవరు? పెళ్లయ్యాక వెంటనే పిల్లలు ఎప్పుడు అని అడుగుతారు. మీకు అది సరైనది అనిపించనప్పుడు ఆ ఒత్తిడిని ఎందుకు తీసుకోవాలి? అని ఆమె ప్రశ్నించారు. నేటి కాలంలో అమ్మాయిలు చాలా స్వతంత్రంగా ఉన్నారని, తమకు ఏది మంచో అది నిర్ణయించుకునే సత్తా వారికి ఉందని హన్సిక అభిప్రాయపడ్డారు.
భవిష్యత్తులో మళ్ళీ ప్రేమలో..
ప్రేమ అనేది ఒక అందమైన అనుభూతి అని, భవిష్యత్తులో మళ్ళీ ప్రేమలో పడతానో లేదో అనేది విశ్వం నిర్ణయిస్తుందని ఆమె చెప్పారు. ఏదైనా బంధంలో మనల్ని మనం కోల్పోకూడదని, ముందు మనల్ని మనం గౌరవించుకుంటేనే ఎదుటివారిని గౌరవించగలమని హన్సిక స్పష్టం చేశారు. ప్రస్తుతం వివాదాలకు దూరంగా ఉంటూ.. తన వృత్తిపరమైన జీవితంలో ముందడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
సర్దుకోలేని విభేదాలతో విడాకులు..
మార్చి 11, 2026న ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు వీరికి పరస్పర అంగీకారంతో విడాకులు మంజూరు చేసింది. 2022 డిసెంబర్‌లో జైపూర్‌లోని ముండోటా కోటలో అట్టహాసంగా వీరి వివాహం జరిగింది. అయితే, పెళ్లయిన ఏడాదిన్నరకే వీరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. జూలై 2024 నుండి ఈ జంట విడిగా ఉంటున్నారు. సర్దుకోలేని విభేదాల కారణంగా విడిపోవాలని నిర్ణయించుకున్న హన్సిక ఎటువంటి భరణం కోరలేదు.

