ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పార్టీ మారిన వ్యవహారంపై స్పీకర్ తీర్పును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి వేసిన పిటిషన్ ను ఇవాళ హైకోర్టు విచారణ చేపట్టింది.
బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి లోక్ సభ ఎన్నికల్లో దానం పోటీ చేశారని మహేశ్వర్ రెడ్డి న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇతర పార్టీ నుంచి నామినేషన్ వేసిన రోజు నుంచే ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలని కోరారు. కర్ణాటక, బీహార్ రాష్ట్రాల్లో ఇలాంటి పిటిషన్ ల పై సుప్రీం కోర్టు తీర్పులను ప్రస్తావించారు.
స్పీకర్ తరపున వాదించేందుకు అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి హాజరయ్యారు. అయితే ఏజీ గా ఉండి స్పీకర్ తరుపున ఎలా వాదిస్తారని ప్రశ్నించింది కోర్టు. సీనియర్ న్యాయవాదిగా హాజరవుతున్నానని చెప్పారు సుదర్శన్ రెడ్డి. దీంతో కౌంటర్ దాఖలు చేయాలని దానం నాగేందర్ తో పాటు, అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు ఇచ్చింది హై కోర్టు. తదుపరి విచారణను ఏప్రిల్ 16 కు వాయిదా వేసిందిహైకోర్టు.
దానం నాగేందర్ పార్టీ మారినట్లు ఎలాంటి ఆధారాలు లేవని ఇటీవలే స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. అలాగే బీఆర్ఎస్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్లను సుప్రీం కోర్టు డిస్పోజ్ చేసింది. ఈ పిటిషన్లపై విచారణ ముగించినట్లు సుప్రీం కోర్టు ధర్మాసనం ప్రకటించింది.
