- సమర్థుడైన మరో వ్యక్తిని నియమించండి
- ఏ సంస్థ అయినా చట్టపరిధిలో పనిచేయాల్సిందే
- ఆస్తుల రక్షణ పేరుతో చట్టాన్ని అతిక్రమించొద్దు
- ఉత్తర్వుల ఉల్లంఘన కోర్టు గౌరవాన్ని దెబ్బతీయడమే
- హామీ ఉల్లంఘన కూడా కోర్టు ధిక్కారమే
- పశ్చాత్తాపంలేని క్షమాపణను తిరస్కరిస్తున్నాం
- హైడ్రా వ్యవహారంలో హైకోర్టు తీర్పు
- లక్షా 50 వేల కోట్ల భూములను రక్షించాం
- ఆర్టికల్ 21, 48ఏను ఫాలో అయ్యాం: రంగనాథ్
ఒకే అధికారి ఏడాదిన్నర కాలంలో 60కిపైగా కోర్టు ధిక్కరణ కేసులను ఎదుర్కొన్నారు. ఇలాంటి అధికారికి వెసులుబాటు కల్పిస్తే న్యాయపాలనకు మరణ శాసనమే. కోర్టు మొదటి అఫిడవిట్‌పై అసంతృప్తి వ్యక్తం చేసిన తర్వాతే క్షమాపణ చెప్పారు. ఆ క్షమాపణలో నిజాయితీ లేనందున దాన్ని తిరస్కరిస్తున్నాం. రికార్డులోని అంశాలు, చర్చించిన అంశాల ఆధారంగా కమిషనర్‌ను ఆ పదవి నుంచి తప్పించాలనే నిర్ణయానికి ఈ కోర్టు వచ్చింది.
అధికారిని ఈ పదవిలో కొనసాగిస్తే చట్టబద్ధపాలన ప్రమాదంలో పడుతుందని ఈ కోర్టు భావిస్తోంది. గతంలో ఈ విషయాన్ని కోర్టు గమనించి హెచ్చరించినా అధికారి సంయమనం పాటించలేదు. అందువల్ల ఆ అధికారిని అక్కడి నుంచి తప్పించి తగిన వ్యక్తిని నియమించాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేస్తున్నాం - హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: హైడ్రా కమిషనర్ పదవి నుంచి ఏవీ రంగనాథ్‌ను తొలగించి ఆ స్థానంలో మరొకరిని నియమించాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి హైకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ పదే పదే హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారని, అందువల్లే ఇలాంటి అసాధారణ ఉత్తర్వులు జారీ చేయాల్సి వస్తోందని పేర్కొంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరి మండలం లోతుకుంట గ్రామం సర్వే నెం.1, 2లోని 40 ఎకరాల భూమిలో ఈ నెల 17న హైడ్రా కూల్చివేతలు చేపట్టడాన్ని సవాలు చేస్తూ శాంతా శ్రీరాం కన్‌స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్ పై జస్టిస్ జూకంటి అనిల్‌కుమార్ సోమవారం విచారణ చేపట్టి ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ సందర్భంగా గ్రీకు పురాణంలో ‘హైడ్రా’ అనే జలరాక్షసి (పలు తలల సర్పం)ని జయించడం అన్నది అసాధ్యమన్న కథను ప్రస్తావిస్తూ ఇక్కడి హైడ్రా కూడా అదే ధోరణితో ఉందని తప్పుబట్టారు. గ్రీకు సంప్రదాయంలో పేర్కొన్న హైడ్రా వలె తనను ఎవరూ జయించలేరన్న అభిప్రాయంతో ఉన్నట్లుందని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇలాంటి అభిప్రాయాన్ని కొనసాగిస్తే ప్రజల హక్కులను పరిరక్షించే న్యాయస్థానాలకు మరణశాసనమే అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఏడాదిన్నరలో 63 కేసులా..?
న్యాయస్థానం ఆదేశాలను విచ్చలవిడిగా ధిక్కరించడంతోపాటు, పదే పదే ఉల్లంఘించే అధికారి చట్టబద్ధపాలన (రూల్ ఆఫ్ లా)ను ప్రమాదంలోకి నెట్టివేసే ప్రమాదం ఉందని న్యాయమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల అలాంటి వ్యక్తి ఆ పదవిలో కొనసాగరాదని వ్యాఖ్యానించింది. ఈ పరిస్థితుల్లో కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన అధికారులపై కఠిన శిక్షలను సిఫారసు చేయడం తప్ప ఈ కోర్టుకు మరో ప్రత్యామ్నాయం లేదంది.
గత ఐదేండ్లలో 9,290 కోర్టు ధిక్కరణ కేసులు పెండింగ్‌లో ఉండగా ఏడాదిన్నరలో 63 కేసులు ఈ ఒక్క అధికారిపై ఉండడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఐజీ ర్యాంకులో కార్యదర్శి స్థాయిలో ఉంటూ ప్రభుత్వ ఆస్తులను, అదీ జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఆస్తులను రక్షించడం ప్రధాన విధిగా ఉందని, అయితే చట్టాన్ని అతిక్రమించి విధులను నిర్వహించాలని లేదన్నారు. ఈ విషయం హైడ్రాను ఏర్పాటు చేస్తూ జారీ అయిన జీవో 99లో స్పష్టంగా ఉందని, కానీ ఏడాదిన్నరలో 63 కోర్టు ధిక్కరణ పిటిషన్‌లు పెండింగ్‌లో ఉండడం అసాధారణమని పేర్కొన్నారు.
ఉల్లంఘన కోర్టు గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీస్తుందని, ప్రస్తుత కేసులో కేవలం కోర్టు ధిక్కరణకే పరిమితమవుతున్నామని న్యాయమూర్తి పేర్కొన్నారు. కోర్టు తీర్పులు, ఉత్తర్వులను అమలు చేయడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైనా ప్రజాస్వామ్య విలువలకు నిబద్ధతకు, చట్టబద్ధపాలనకు అంచనా వేసే కొలమానాల్లో ఒకటని పేర్కొన్నారు.
న్యాయస్థానం ఔన్నత్యం అది ఇచ్చే ఆదేశాలకు ఇచ్చే గౌరవం ఆధారంగా ఉంటుంది. కోర్టు ఉత్తర్వులు, తీర్పుల అమలు ‘చట్టం ముందు అంతా సమానమే’ అన్న సూత్రంలో అంతర్భాగంగా ఉంటుందన్నారు. కోర్టును ఆశ్రయించడం కక్షిదారు ప్రాథమిక హక్కు అని, దాన్ని అమలు చేయించుకోవడం కూడా రాజ్యాంగం కల్పించిన హక్కుల్లో భాగమేనని పేర్కొన్నారు.
పదే పదే ఉల్లంఘన
శాంతా శ్రీరాం కన్‌స్ట్రక్షన్‌కు సంబంధించిన ఆస్తి వివాదంలో హైడ్రా ఎక్కడా ప్రతివాదిగా లేదన్న విషయాన్ని న్యాయమూర్తి పేర్కొన్నారు. మొదట దాఖలు చేసిన రిట్ పిటిషన్‌లో, ఆపైన అప్పీలులో, సివిల్ కోర్టు సూట్, దానిపై మొదటి అప్పీలులో ఎక్కడా లేరని, చివరికి మొదటి కోర్టు ధిక్కరణ పిటిషన్‌లో కూడా ప్రతివాదిగా లేరన్నారు. అయితే రెండో కోర్టు ధిక్కరణ పిటిషన్ నుంచి ప్రతివాదిగా వచ్చారని, కోర్టుకు ఇచ్చిన హామీని పదే పదే ఉల్లంఘించారన్నారు. పిటిషనర్లకు చెందిన 40 ఎకరాల భూవివాదంలో హైడ్రా తరఫు న్యాయవాది కోర్టుకు హామీ ఇచ్చినప్పుడు ఏ స్థాయి అధికారి అయినా దానికి కట్టుబడి ఉండాల్సిందేనన్నారు.
కోర్టు ధిక్కరణ పిటిషన్ సందర్భంగా రెవెన్యూ శాఖకు సహకరించడానికే హైడ్రా అధికారులు వెళ్లారని, పోలీసు ఇన్‌స్పెక్టర్, మండల సర్వేయర్ ఉన్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా హాజరైన అధికారి ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో భాగంగా వెళ్లామన్న వాదనను అనుమతించలేమన్నారు. రికార్డులను పరిశీలిస్తే హైడ్రా అధికారులు పిటిషనర్ స్థలంలోకి వెళ్లి తాత్కాలిక నిర్మాణాలను ధ్వంసం చేసినట్లు ఆధారాలున్నాయని చెప్పారు. వీటిని హైడ్రా ఖండించలేదన్నారు.
ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ పేరుతో చట్టాన్ని అతిక్రమించే అధికారం ఏ అధికారికీ లేదని పేర్కొన్నారు. అధికార పరిధి ఉన్న కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించడం కోర్టు ధిక్కరణకు కిందకు వస్తుందని తెలిసిన వ్యక్తికి అవకాశం ఇస్తే ఇది చట్టబద్ధ పాలనతోపాటు కోర్టు గౌరవాన్ని దెబ్బతీస్తుందన్నారు. ఇన్ని పిటిషన్లు దాఖలైనా కోర్టు ఉత్తర్వులను అమలు చేయడంలో ఎలాంటి మార్పు కనిపించకపోవడం ఆందోళనకరమన్నారు.
పశ్చాత్తాపాన్ని తిరస్కరిస్తున్నాం
హైడ్రా మొదటిసారి వేసిన అఫిడవిట్ పై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేయగా ఈ నెల 27న మరో అఫిడవిట్ దాఖలు చేశారని, ఇందులో చెప్పిన క్షమాపణలో నిజాయతీ లేదని న్యాయమూర్తి పేర్కొన్నారు. కోర్టు మొదటి అఫిడవిట్‌పై అసంతృప్తి వ్యక్తం చేసిన తరువాతే క్షమాపణ చెప్పారని, అందులో నిజాయితీ లేనందున దాన్ని తిరస్కరిస్తున్నామన్నారు. రికార్డులోని అంశాలు, పైన చర్చించిన అంశాల ఆధారంగా కమిషనర్‌ను ఆ పదవి నుంచి తప్పించాలనే నిర్ణయానికి ఈ కోర్టు వచ్చిందని పేర్కొన్నారు.
అధికారిని ఈ పదవిలో కొనసాగిస్తే చట్టబద్ధపాలన ప్రమాదంలో పడుతుం దని ఈ కోర్టు భావిస్తున్నదని, గతంలో హెచ్చరించినా అధికారి సంయమనం పాటించలేద దన్నారు. అందువల్ల ఆ అధికారిని అక్కడి నుంచి తప్పించి తగిన వ్యక్తిని నియమించాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేస్తున్నామని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. పిటిషనర్‌కు చెందిన నిర్మాణాల కూల్చివేత నష్టాన్ని హైడ్రా నుంచి వసూలు చేసుకోవచ్చని అనుమతించారు. తీర్పు పూర్తి ప్రతిని రెండు మూడు రోజుల్లో విడుదల చేస్తామని పేర్కొన్నారు.
