అనుమతులు లేకుండా నిర్మించి కోర్టుకొస్తరా?.. భవనాన్ని కూల్చొద్దని వేసిన పిటిషనర్పై హైకోర్టు వ్యాఖ్య

అనుమతులు లేకుండా నిర్మించి కోర్టుకొస్తరా?.. భవనాన్ని కూల్చొద్దని వేసిన పిటిషనర్పై హైకోర్టు వ్యాఖ్య
  • అధికారులు కూల్చివేత చర్యలు చేపట్టగానే రక్షించాలని కోరడం పరిపాటైంది

హైదరాబాద్, వెలుగు: అనుమతులకు విరుద్ధంగా భవనాలు నిర్మించి, అధికారులు కూల్చివేత చర్యలు తీసుకునే సమయంలో  రక్షణ కల్పించాలని కోర్టులను ఆశ్రయించడం సరైన పద్ధతి కాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఎవరినైనా ప్రభావితం చేయగలమనే ధైర్యంతోనే కొందరు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారా అని ప్రశ్నించింది. జీడిమెట్లలో 267 గజాల స్థలంలో నిర్మించిన భవనాన్ని తొలగించాలని మున్సిపల్ అధికారులు ఇచ్చిన నోటీసును సవాల్ చేస్తూ వ్యాపారి శశికాంత్ శర్మ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ కేసును జస్టిస్ ఎన్.వి. శ్రవణ్ కుమార్ విచారించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది మాట్లాడుతూ, చట్ట ప్రకారం వివరణ కోరకుండా అధికారులు నేరుగా భవనాన్ని సీల్ చేశారని తెలిపారు. కూల్చివేత చర్యలు చేపట్టకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. స్థలం విస్తీర్ణం ఆధారంగా నిర్మాణ అనుమతులు ఇస్తారని, కానీ చాలామంది వాటిని పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా భవనాలు కడుతున్నారని పేర్కొంది.

ఇలాంటి నిర్మాణాల వల్ల పొరుగువారికి కలిగే ఇబ్బందులను కూడా పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించింది. నిర్మాణం అక్రమమని తేలితే భారీ జరిమానా విధించే అవకాశం ఉందని హెచ్చరించింది. అధికారులను కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించిన కోర్టు, తదుపరి విచారణను జులై 7కు వాయిదా వేసింది.