క్రెడిట్‌‌‌‌ కార్డు ఒప్పందం వ్యక్తిగతమే : హైకోర్టు 

క్రెడిట్‌‌‌‌ కార్డు ఒప్పందం వ్యక్తిగతమే : హైకోర్టు 
  •  బకాయి చెల్లించలేదంటూ.. 
  • బ్యాంక్ ఉద్యోగిపై క్రమశిక్షణ చర్యలు చెల్లవు: హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: బ్యాంకు ఉద్యోగి తీసుకున్న క్రెడిట్‌‌‌‌ కార్డు వ్యవహారం బ్యాంకుతో కుదిరిన వాణిజ్య ఒప్పందమేనని హైకోర్టు పేర్కొంది. అది ఉద్యోగి, బ్యాంక్ యజమానికి సంబంధించిన వ్యవహారం కాదని తెలిపింది. క్రెడిట్‌‌‌‌ కార్డు బకాయి చెల్లించడంలో జాప్యం జరిగిందన్న కారణంగా బ్యాంకు ఉద్యోగిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం చెల్లదని స్పష్టం చేసింది.

క్రెడిట్‌‌‌‌ కార్డు బకాయిల చెల్లింపులో జాప్యం కారణంగా జారీ చేసిన నిర్బంధ పదవీ విరమణ ఉత్తర్వులను సవాలు చేస్తూ హైదరాబాద్‌‌‌‌కు చెందిన యూనియన్‌‌‌‌ బ్యాంకు (గతంలో ఆంధ్ర బ్యాంకు) ఉద్యోగి ఎం. ప్రకాశ్‌‌‌‌బాబు హైకోర్టులో పిటిషన్‌‌‌‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌‌‌‌ జువ్వాడి శ్రీదేవి విచారణ చేపట్టారు. పిటిషనర్‌‌‌‌ తరఫు న్యాయవాది వాదిస్తూ..పిటిషనర్‌‌‌‌ 1979లో ఆంధ్ర బ్యాంకులో ప్రొబేషనరీ ఆఫీసర్‌‌‌‌గా విధుల్లో చేరారని, అనంతరం క్రెడిట్‌‌‌‌ కార్డు బకాయి సకాలంలో చెల్లించలేదన్న కారణంగా శాఖాపరమైన విచారణ జరిపి నిర్బంధ పదవీ విరమణ ఉత్తర్వులు జారీ చేశారన్నారు.

క్రెడిట్‌‌‌‌ కార్డు అన్నది పూర్తిగా వ్యక్తిగతమైనదని కోర్టుకు తెలిపారు. అనారోగ్యం, సెలవుల వంటి ఆర్థిక ఇబ్బందుల వల్ల కార్డు బకాయి రూ. లక్ష నుంచి రూ. 1.68 లక్షలకు చేరినప్పటికీ, ఆ తర్వాత ఆ మొత్తాన్ని రికవరీ చేశారని కోర్టుకు తెలిపారు. బ్యాంకు తరఫున సీనియర్‌‌‌‌ న్యాయవాది కె. లక్ష్మీనరసింహ వాదిస్తూ..క్రెడిట్‌‌‌‌ కార్డు విభాగం నుంచి బిల్లు బకాయిలు చెల్లించాలంటూ లేఖలు వెళ్లినా పిటిషనర్ స్పందించలేదన్నారు. దీనిపై 2008లో అభియోగ పత్రం దాఖలు కాగా, విచారణ అనంతరం కమిటీ దీన్ని తీవ్రమైన దుష్ప్రవర్తనగా నిర్ధారించి నిర్బంధ పదవీ విరమణ శిక్ష విధించినట్లు తెలిపారు.a

న్యాయమూర్తి స్పందిస్తూ..  క్రెడిట్‌‌‌‌ కార్డు  చెల్లింపు  పర్సనల్ అని , అది అధికారిక విధులకు సంబంధించినది కాదని స్పష్టం చేశారు. క్రెడిట్‌‌‌‌ కార్డు బకాయిల చెల్లింపులో జాప్యం జరిగినంత మాత్రాన ఉద్యోగంలో క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం చట్టప్రకారం చెల్లదని తెలిపారు.2008 నాటి ఛార్జ్‌‌‌‌షీట్‌‌‌‌తో పాటు విచారణ కమిషన్‌‌‌‌ నివేదికను, నిర్బంధ పదవీ విరమణ ఉత్తర్వులను రద్దు చేస్తూ తీర్పు వెలువరించారు.