దేశంలోనే మన రాష్ట్రంలో హయ్యెస్ట్ పాజిటివ్ రేట్

దేశంలోనే మన రాష్ట్రంలో హయ్యెస్ట్ పాజిటివ్ రేట్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వైరస్ విస్తరిస్తోంది. టెస్టులు పెంచుతున్న కొద్దీ కేసులు కూడా పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన నెల రోజులుగా కరోనా టెస్టులు చేయించుకుంటున్న ప్రతి వందలో సుమారు 19 మందికి వైరస్ పాజిటివ్ తేలింది. దేశంలో మరే రాష్ట్రంలోనూ ఈ స్థాయిలో పాజిటివ్ రేటు లేదు. రాష్ట్రంలో గత నెల 16వ తేదీ నుంచి, ఈ నెల 16 నాటికి 21,043 టెస్టులు చేయగా, 3,897 మందికి వైరస్ ఉన్నట్టు తేలింది. ఈ నెల రోజుల్లో పాజిటివ్‌ రేట్‌ 18.51శాతంగా నమోదైంది. నెల రోజుల క్రితం వరకూ పాజిటివ్ రేట్‌ 6.45 శాతం మాత్రమే ఉండేది. ప్రైమరీ కాంటాక్టులకు టెస్టులు చేయకుండా వదిలేయడం, వైరస్‌ లక్షణాలున్నా కాంటాక్ట్ హిస్టరీ లేదని టెస్టులకు నిరాకరించడం వంటి చర్యలతో నెల రోజుల్లోనే పరిస్థితి పూర్తిగా దిగజారింది. ఇప్పుడు రోజూ రెండొందలకుపైగా కేసులు నమోదవుతున్నయి. వైరస్ కట్టడిలో ఫ్రంట్‌లైన్​లో ఉండే డాక్టర్లు, ఆఫీసర్లు, పోలీసులు, జర్నలిస్టులు, శానిటేషన్​ కార్మికులు ఇలా అందరూ వైరస్ బారిన పడుతున్నారు. ఎక్కడ చూసినా కరోనా కలవర పెట్టే పరిస్థితి వచ్చింది. దేశంలో కరోనా వ్యాప్తి ప్రారంభమై నాలుగు నెలలు అవుతోంది. ఈ 4 నెలల్లో దేశంలో 60,84,256 మందికి కరోనా టెస్ట్ చేశారు.

ఇందులో మన రాష్ట్రంలో చేసింది కేవలం 44,431 టెస్టులు. అంటే, దేశంలో చేసిన టెస్టుల్లో మనవి 0.73 శాతం మాత్రమేనని స్పష్టమవుతోంది. కానీ, వైరస్ వ్యాప్తిలో మాత్రం మన రాష్ట్రం మూడో ప్లేస్‌‌‌‌లో ఉంది. మంగళవారం నాటికి చేసిన 44,431 టెస్టుల్లో, 12.16 శాతం (5406) మందికి వైరస్‌‌‌‌ పాజిటివ్ వచ్చింది. అత్యధిక కేసులు నమోదైన మహారాష్ట్రలో16.5, ఢిల్లీలో 14.6, గుజరాత్‌‌‌‌లో 8.2 శాతం పాజిటివ్‌‌‌‌ రేట్ ఉంది. తమిళనాడు సహా మిగిలిన అన్ని రాష్ట్రాల్లోనూ 6.5 కంటే తక్కువగా పాజిటివ్ రేట్‌‌‌‌ నమోదవుతోంది.

ఒంటెద్దు పోకడ!
ఒక్క తెలంగాణ సర్కార్‌‌‌‌‌‌‌‌ తప్ప, దేశంలోని మిగిలిన అన్ని రాష్ట్రాలూ ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీటింగ్ విధానాన్నే నమ్ముకున్నాయి. పాండమిక్‌‌‌‌ను ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలన్నీ ఇదే ఫార్ములా ఫాలో అయ్యాయి. మన రాష్ట్రంలో మాత్రం టెస్టింగ్‌‌‌‌ను మధ్యలోనే వదిలేశారు. టెస్టులు చేయాలన్న వారిని అవగాహన లేనివారిగా ముద్ర వేసేందుకు ప్రయత్నించారు. ఇప్పుడు వైరస్ వ్యాప్తి పెరుగుతుండడంతో, టెస్టుల సంఖ్య పెంచుతున్నారు. అయితే, ఇన్నాళ్లు టెస్టింగ్‌‌‌‌ను నిర్లక్ష్యం చేసిన అధికారులు, ఇప్పుడు ట్రేసింగ్‌‌‌‌ కూడా అంతంత మాత్రంగానే చేస్తున్నారు. వైరస్ పాజిటివ్ వచ్చిన వారి ప్రైమరీ కాంటాక్టులకు కూడా సమాచారం ఇవ్వడం లేదు. విషయం తెలుసుకుని వాళ్లంతట వాళ్లొస్తే తప్ప టెస్టులు చేయడం లేదు. కరోనాను కట్టడి చేయాలంటే టెస్టింగ్‌‌‌‌తోపాటు ట్రేసింగ్‌‌‌‌ కూడా పక్కాగా చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

ప్రతి మిలియన్‌‌‌‌కు..
దేశంలోని 26 రాష్ట్రాల్లో ప్రతి పది మిలియన్‌‌‌‌ జనాభాలో 2,800, అంతకంటే ఎక్కువ మందికి టెస్టులు చేశారు. మన రాష్ట్రంలో మాత్రం మంగళవారం నాటికి ప్రతి మిలియన్‌‌‌‌ జనాభాకి కేవలం 1,100 టెస్టులు మాత్రమే చేశారు. బీహార్, యూపీ రాష్ట్రాలు మాత్రమే మనకంటే వెనుకబడి ఉన్నాయి. సంఖ్యాపరంగా చూస్తే, ఈ రెండు రాష్ట్రాల్లోనూ మనకంటే ఎక్కువ టెస్టులే చేశారు.

రెచ్చగొడితే బుద్ధిచెబుతాం