- ఇంటింటికీ వెళ్లి బొట్టుపెట్టి ఆహ్వానిస్తున్న కార్పొరేట్లర్లు
కరీంనగర్, వెలుగు: హనుమాన్ జయంతి సందర్భంగా ఈ నెల 12న మంగళవారం కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘హిందూ ఏక్తా యాత్ర’కు చకచకా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. హిందువులందరినీ రాజకీయాలకతీతంగా సంఘటితం చేయాలనే లక్ష్యంతో సరిగ్గా 16 ఏళ్ల కింద సంజయ్ కరీంనగర్ లో ఈ యాత్రను ప్రారంభించారు. మొదట్లో పదుల సంఖ్యతో ప్రారంభించిన ఈ యాత్రలో ఆ తర్వాత ఏటేటా వేలాదిగా పాల్గొంటున్నారు. ఈసారి భారీగా ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తూ అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇంటింటికీ వెళ్లి బొట్టుపెట్టి ఆహ్వానిస్తున్న కార్పొరేట్లర్లు
గతానికి భిన్నంగా ఈసారి ‘హిందూ ఏక్తా యాత్ర’కు రావాలంటూ కాషాయ శ్రేణులు, కార్పొరేటర్లు ఇంటింటికీ వెళ్లి బొట్టుపెట్టి ఆహ్వానిస్తున్నారు. కాషాయ శ్రేణులు తమ తమ డివిజన్లలోని, కాలనీల్లోని గోడలపై 'హిందూ ఏక్తా యాత్ర'కు తరలిరావాలంటూ స్వయంగా వాల్ పెయింటింగ్ రాశారు. బండి సంజయ్ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం 4 గంటలకు కరీంనగర్‌లోని వైశ్యా భవన్ నుంచి ప్రారంభమయ్యే ఏక్తాయాత్రలో స్వచ్ఛందంగా మంచినీళ్లు, మజ్జిగ, ఇతర ఆహార పానీయాలను అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
దాదాపు 6 గంటలపాటు కొనసాగే హిందూ ఏక్తా యాత్రలో పాల్గొనే హిందుత్వ వాదులు, కరీంనగర్ పట్టణ ప్రజలను ఆకట్టుకునేలా వివిధ రూపాల్లో కళా ప్రదర్శనలు నిర్వహించనున్నారు. ‘హిందూ ఏక్తా యాత్ర’ సందర్భంగా హిందుత్వ వాదుల్లో జోష్ నింపేందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ సిద్ధమయ్యారు.
