- హెచ్ఎండీఏ అధికారుల తీరుపై స్థానికుల నిరసన
- పెద్దలను వదిలేసి పేదలపై ప్రతాపం చూపిస్తున్నారని ఫైర్
మియాపూర్, వెలుగు : మియాపూర్ సర్వే నంబర్ 100లోని హెచ్‌ఎండీఏ ప్రభుత్వ భూమిలో వెలసిన అక్రమ నిర్మాణాలను అధికారులు బుధవారం కూల్చివేశారు. ఎంఏ నగర్ వైపు హెచ్‌ఎండీఏ వేసిన ఫెన్సింగ్‌ను తొలగించి కొందరు అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో ఏఈఓ శ్రీశైలం ఆధ్వర్యంలో హెచ్‌ఎండీఏ, స్థానిక పోలీసులు భారీగా మోహరించి ఆ నిర్మాణాలను తొలగించారు. ఈ క్రమంలో 20 ఏండ్లుగా ఇక్కడే నివాసం ఉంటున్న తమ గుడిసెలను కూల్చివేస్తూ, అదే స్థలంలో వెలసిన భారీ బిల్డింగులను అధికారులు ఎందుకు వదిలేస్తున్నారని స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. నిరంతరం నిఘా ఉండే ఈ భూమిలో ఆక్రమణలు ఎలా జరుగుతున్నాయని అధికారులను నిలదీశారు. పెద్దల నిర్మాణాలకు అండగా నిలుస్తూ పేదల ఇళ్లను తొలగించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
